Chiranjeevi mediating between ys jagan- film industryమెగాస్టార్ చిరంజీవి దంపతులు నిన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని తన తాడేపల్లి ఇంటిలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య కొన్ని కీలక విషయాలు చర్చకు వచ్చినట్టుగా చిరంజీవి తెలిపారు. “సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటే.. ‘ఎనీ టైమ్‌ అన్నా కచ్చితంగా అందర్నీ కలుస్తాను. సమయం తీసుకొని ఏర్పాటు చేయండి’ అని వైఎస్‌ జగన్‌ నాతో చెప్పారు,” అని చిరంజీవి అన్నారు.

ముఖ్యమంత్రి అయ్యాకా ఎందుకనో సినీ ప్రముఖులెవరూ జగన్ ని కలవలేదు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కొంత అసహనం ఉంది. పృథ్వి వంటి వారైతే అదే చంద్రబాబు సీఎం అయితే కమ్మ కులస్థులు ఎక్కువగా ఉండే సినీ ప్రముఖులు ఈ పాటికి లైన్ కట్టే వారు అని బాహాటంగానే విమర్శించారు. ఈ క్రమంలో చిరంజీవి ఇరువైపులా మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఇదే సందర్భంగా .. “సినీ పరిశ్రమకు ఏది కావాలన్నా తానెప్పుడూ ముందుంటానని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఏది కావాలన్నా అడగడానికి ఏ మాత్రం సంకోచించవద్దని అన్నారు. వైఎస్‌ జగన్‌ సహాయం చేసే గుణానికి నాకు చాలా సంతోషమేసింది. కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగింది,” అంటూ చిరంజీవి జగన్ పై ప్రశంసలతో ముంచెత్తారు.

“ఎంతో ప్రేమతో, సోదర వాత్సల్యంతో వైఎస్‌ భారతి మమ్మల్ని ఆహ్వానించారు. కుటుంబ సభ్యుల మధ్య గడిపిన అనుభూతి కలిగింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్‌ భారతికి ప్రత్యేకించి నా అభినందనలు,” అని చెప్పుకొచ్చారు చిరంజీవి. కాగా ఈ వారంలోనే విజయవాడలోని ఒక మల్టీప్లెక్స్ లో జగన్ కుటుంబసమేతంగా సైరా సినిమా వీక్షించనున్నట్టు సమాచారం.