Chiranjeevi, Chiranjeevi Jabardasth RP, Chiranjeevi Likes Jabardasth RP, Chiranjeevi Likes Jabardasth RP Skits, Chiranjeevi Likes Jabardasth RP Shows, Chiranjeevi Likes Jabardasth RP Plays‘జబర్దస్త్’ షోలో ‘ఆర్పీ’గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాటకొండ ప్రసాద్ తన ఫ్లాష్ బ్యాక్ ని ఓ ప్రముఖ దినపత్రికతో పంచుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న ఆర్పీ గత జీవితం సినిమా కష్టాలతో నిండుకుని ఉందన్న విషయం తాజాగా వెలుగు చూసింది. ఆర్పీ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ కు నేషనల్ అవార్డు రావడంతో మలుపు తిరిగిన జీవితం ‘జబర్దస్త్’ వరకు తీసుకొచ్చిందని చెప్పిన వివరాలు క్లుప్తంగా…

తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమని, ఇంట్లో పూట గడవని పరిస్థితుల్లో తాను హైదరాబాద్ కు చేరానని… సినిమాల్లో అవకాశాలు రాక, చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో… హోటల్లో సప్లయర్ గా, బస్తాలు మోస్తూ డబ్బులు సంపాదిస్తూ, సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేశానని తన కష్టాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి పీఏ ద్వారా తనకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ రావడంతో కొన్ని చిత్రాలకు పని చేశానని అన్న ఆర్పీ 2013లో తన కెరీర్ మరో మలుపు తిరిగిందని అన్నాడు.

తాను రచించిన ఓ కథ హీరో శ్రీహరికి నచ్చడంతో 2013, ఆగష్టు 13వ తేదీన ఓ ప్రకటన చేసారని, అయితే అదే ఏడాది అక్టోబర్ 9వ తేదీన శ్రీహరి మరణించడంతో ఒక్కసారిగా తన ఆశలన్నీ అడుగంటి పోయాయని తెలిపాడు ఆర్పీ. అయితే తర్వాత “పిచ్చి ప్రేమ” పేరుతో తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ కు జాతీయ అవార్డు రావడంతో తనకు గుర్తింపు లభించిందని అన్న ఆర్పీ, ఆ క్రమంలో నటుడు ధన్ రాజ్ ను కలిసి ‘జబర్దస్త్’ లో తనకు అవకాశమివ్వాలని అడగటం జరిగిందన్నాడు.

అలా ‘జబర్దస్త్’లో తన ప్రయాణం మొదలైందని చెప్పిన ఆర్పీ, తాను మర్చిపోలేని రెండు విషయాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘జబర్దస్త్’షోలో నాకు నచ్చిన నటుడు ఆర్పీ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇంటికి తనను భోజనానికి ఆహ్వానించడం వంటివి జీవితంలో మరిచిపోలేని, సంతోషకరమైన సంఘటనలుగా ఆర్పీ చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి నవ్వించడం తనకు అలవాటని.. అదే తనకు వరంగా మారి, ‘జబర్దస్త్’లో నటిస్తున్నానని ఆర్పీ చెప్పిన సంగతులు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాదు, ఆర్పీపై ప్రేక్షకులకు మరింత గౌరవాన్ని పెంచేలా ఉన్నాయి.