chiranjeevi-khaidi-no-150-movie-release-dateమెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “ఖైదీ నంబర్ 150” సినిమాకు సంబంధించిన చిరంజీవి లుక్స్ విడుదలయ్యాయి. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ఎంట్రీ ఇచ్చిన రెండు పోస్టర్లు మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చేతికి కంకణం పెట్టుకుని, ఓ చిరునవ్వు చిందిస్తున్న ఫోటో ఒకటి కాగా, మెగాస్టార్ అంటే గుర్తుకు వచ్చే డ్యాన్సింగ్ స్టిల్ మరొకటి. ఈ రెండు కూడా ఫ్యాన్స్ అంచనాలకు తగిన విధంగానే ఉన్నాయి.

అయితే ఈ రెండు స్టిల్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాయి. “ఖైదీ నంబర్ 150” సినిమా ఏ వర్గాన్ని టార్గెట్ చేసిందో ఈ రెండు పోస్టర్లు స్పష్టంగా చెప్పేసాయి. ఇప్పటివరకు మెగా వంశానికి అండదండలుగా ఉండే మెగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని ‘ఖైదీ నంబర్ 150’ రూపొందుతుందన్న విషయాన్ని ఈ దీపావళి పోస్టర్లు క్లారిటీ ఇచ్చాయి.

గత చరిత్రను పరిశీలించినా కూడా…. మెగా హీరోలు నటించిన మాస్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడంతో, ఎలాంటి ప్రయోగాలకు తావు లేకుండా “ఖైదీ నంబర్ 150” టార్గెట్ ఫిక్స్ అయ్యిందని అభిమానులకు కూడా స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయి. పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ఈ మెగా మూవీ బాక్సాఫీస్ వద్ద నూతన బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఎన్నో అంచనాలతో ఉండగా, ఈ పోస్టర్లు వారి నమ్మకాన్ని మరింతగా పెంచాయి.