chiranjeevi-khaidi-no-150-shooting-in-climaxవివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా మలి షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది. టాకీ పార్ట్ పూర్తి అయిన తర్వాత నవంబర్ లో చిత్రంలో మిగిలి ఉన్న పాటల చిత్రీకరణను జరపనున్నారు. మొత్తమ్మీద నవంబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఆ తర్వాత డిసెంబర్ నుండి ఆడియో హంగామాతో మొదలై, సంక్రాంతి వరకు నిర్విరామంగా పబ్లిసిటీ కార్యక్రమాలతో భారీ ఓపెనింగ్స్ లక్ష్యంగా “ఖైదీ” సిద్ధమవుతున్నాడని ట్రేడ్ వర్గాల టాక్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు తగినంత సమయం కేటాయించి, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్న నేపధ్యంలోనే, నవంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించుకున్నట్టుగా తెలుస్తోంది.

మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ సినిమా మురుగదాస్ – విజయ్ ల “కత్తి” రీమేక్ అన్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు చిరు వారసుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన దీపావళి స్టిల్స్ అభిమానుల కళ్ళల్లో కొత్త కాంతులను చూడడంలో సక్సెస్ కావడంతో, ‘బాస్ ఈజ్ బ్యాక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.