chiranjeevi-joins-tdpసినీ రంగంలో ‘మెగాస్టార్’ చిరంజీవికి తిరుగులేదు. నాణానికి మరో వైపు చూస్తే… రాజకీయ రంగంలో మెగాస్టార్ పేరుకు ఆస్కారం లేదు. ప్రజారాజ్యం నుండి కాంగ్రెస్ కు వచ్చిన చిరు పొలిటికల్ కెరీర్ పై మెగా అభిమానులే బహిరంగంగా విమర్శిస్తున్న రోజులివి. అందుకే మరిన్ని సినిమాలు చేయమని అభిమానుల నుండి మెగాస్టార్ పై మరిన్ని ఒత్తిడి వస్తోంది. దీనికి తగిన విధంగానే చిరు కూడా పొలిటికల్ కెరీర్ ను చాలా తేలికగా తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ లో ఉంటున్నప్పటికీ, ఒక్క కుల రాజకీయాలపై తప్ప యాక్టివ్ గా మరే ఇతర విషయంలోనూ స్పందించడం లేదు. ఆ కుల రాజకీయాలను కూడా తన వైపుకు మలుచుకోవడంలో మెగాస్టార్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో చిరు కాపు కుల సమావేశాలు జరిగినప్పుడల్లా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటున్నాయి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి రాజకీయ కెరీర్ పై తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ వార్త వింటే ఖచ్చితంగా అందరూ ఓ ‘స్మైల్’ ఇచ్చే విధంగా ఉండడం ఖాయం.

ఇంతకీ విషయం ఏమిటంటే… డిసెంబర్ 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోబోతున్నారని ఓ ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ తో జరిపిన సంప్రదింపులు సఫలీకృతం అయ్యాయని, దీంతో డిసెంబర్ 5న ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారని, ఫేస్ బుక్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. వినడానికి కాస్త స్పైసీగా ఉంటుందేమో గానీ, ఈ ప్రచారంలో అసలు వాస్తవం లేదన్న విషయం రాజకీయ విజ్ఞులకు ఇట్టే అర్ధమవుతుంది.

చిరంజీవి టిడిపిలోకి రావడం కొత్తగా తెలుగుదేశం పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరదు గానీ, కాపు ఉద్యమం పూర్తిగా నీరుగారిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ, అధికారంలో ఉన్న టిడిపిలో చిరు చేరుతున్నారంటే, ఇప్పటికే ఓ రేంజ్ లో డ్యామేజ్ అయిన ఇమేజ్ కు మరింత తోడయ్యే అవకాశం ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో కలిసిన చిరు, ఇప్పుడు టిడిపిలో చేరారు, ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేరిపోతారన్న చెడ్డ పేరును మూటకట్టుకున్న వారవుతారు. అయినా “ప్రజారాజ్యం, కాంగ్రెస్” పార్టీల పర్యవసానాల రీత్యా చిరును చేర్చుకునే సాహాసం టిడిపి చేయకపోవచ్చు. మొత్తంగా ఈ లేటెస్ట్ మెగాస్టార్ ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో ఓ ఆహ్లాదకరమైన నవ్వును పంచుతోంది.