Chiranjeevi Joins TDP Jumpఒకప్పటి ‘ప్రజారాజ్యం’ అధినేత, మాజీ కేంద్రమంత్రి విధి నిర్వాహకులు అయిన చిరంజీవికున్న రాజ్యసభ సభ్యత్వం ముగియనుండడంతో… ప్రస్తుతం ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ ను విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు ఇటీవల పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇందు నిమిత్తం టిడిపికి మెగాస్టార్ గారు… “తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు, వీలైతే మళ్ళీ కేంద్రమంత్రి పదవి, అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తనకు కావాల్సిన వారికి ఇద్దరికీ టికెట్లు ఇవ్వాలనే” తదితర కండిషన్లు పెట్టారని ప్రధానంగా వినపడ్డాయి.

ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా గానీ, రాజకీయ రంగంలో చిరంజీవికి ఉన్న క్రెడిబులిటీ మరియు ఫ్లాష్ బ్యాక్ ల రీత్యా పొలిటికల్ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా నమ్మే స్థితికి వచ్చారు. దీంతో జరిగిన ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు రామచంద్రయ్య రంగంలోకి దిగి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, అవి సఫలీకృతం కాలేకపోగా, మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీంతో చిరు ఉదంతంపై స్పష్టత ఇచ్చేందుకు తాజాగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రంగంలోకి దిగారు.

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో మీడియా వర్గాలతో మాట్లాడిన రఘువీరారెడ్డి… “చిరంజీవి రాజకీయ శేష జీవితం మొత్తం ఒక్క కాంగ్రెస్ పార్టీకే అంకితమని” ఒక స్పష్టమైన ప్రకటన చేసారు. రఘువీరా తాజా ప్రకటనతో అయినా మెగాస్టార్ ‘జంపింగ్’ వార్తలకు శుభంకార్డు పడుతుందేమో చూడాలి. అయితే ఇలాంటి ఒక స్పష్టమైన ప్రకటనే కావాలంటున్నారు టిడిపి అభిమానులు.

‘ప్రజారాజ్యం’ పార్టీని పెట్టి విలీనం చేసిన చిరంజీవి, కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో, కనీసం ఆ పార్టీ సభ్యులు డిపాజిట్ లు కూడా దక్కించుకోలేకపోయారన్న నానుడి పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన దరిమిలా, టిడిపిలోకి చిరు ఎంట్రీ ఇవ్వడం ఒక రకంగా పార్టీ అభిమానులను కలవరపెట్టింది. దీంతో రఘువీరా తాజా ప్రకటనతో టిడిపి ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది, ఆందోళన చెందిన అభిమానులు కాస్త స్థిమిత పడ్డట్లుయ్యింది.