chiranjeevi jagan 125th birth anniversary of Alluri Sitaramarajuమన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈరోజు భీమవరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన బిజెపికి చెందినవారు కారు కానీ ప్రధాని నరేంద్రమోడీ ఆయనను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.

ఆయన వైసీపీకి చెందినవారు కారు కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవి తన సోదరుడివంటివారని అన్నారు. (ఆ లెక్కన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌ కూడా జగన్‌కు తమ్ముడవుతాడు కానీ పవన్ కళ్యాణ్‌ మాత్రం దత్తపుత్రుడే. అది వేరే లెక్క!).

అలాగే సినీ పరిచయం ఉన్నందున మంత్రి రోజమ్మ కూడా చిరంజీవితో సరదాగా మాట్లాడి సెల్ఫీ కూడా తీసుకొని సంతోషపడ్డారు. ఇక మెగాస్టార్ వస్తున్నారని తెలియగానే తూగోజీ… పగోజీ అనే తేడా లేకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

వారిరాకతో భీమవరం సభలో నిలుచోనేందుకు కూడా జాగా దొరక్క చాలా మంది బయటే ఉండిపోయారు. తన సభకు ఇంత మంది రావడం చూసి ప్రధాని నరేంద్రమోడీ కూడా చాలా సంతోషిస్తూ, సభలో ఉన్నవారికి, బయట ఉన్నవారికి కూడా దండాలు పెట్టి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

బిజెపితో సంబంధాలున్న పవన్ కళ్యాణ్‌ ఈ కార్యక్రమానికి వస్తారనుకొంటే ఆయన పిలిచినా రాలేదు. బిజెపికి కటీఫ్ చెప్పేయబోతున్నారు కనుకనే వెళ్ళలేదని అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.

కానీ ఈ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని ప్రేమగా కౌగలించుకోవడం, సోదరుడని సంభోదించడం చూస్తే, చిరంజీవి సినీ కష్టాలన్నీ తీరిపోయినట్లే ఉంది. కానీ అందుకు కొంత మూల్యం చెల్లించాల్సి రావచ్చు. వచ్చే ఎన్నికలలో ఎదురీదబోతున్న వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి రావచ్చు. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చని చిరంజీవి భావించి ఓకే చెపితే, రాబోయే ఎన్నికల వరకు అంటే మరో రెండేళ్ళ వరకు ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ వేసే అవకాశం ఉంటుంది.