chiranjeevi-is-famous-for-word-mergingతెలంగాణాలో టిఆర్ఎస్ జోరుకు టిడిపి వెలవెలబోతోంది. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తుంటే… మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఠాగూర్” సినిమాలో ఒక డైలాగ్ గుర్తుకోస్తోంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం “క్షమించడం” అని మెగాస్టార్ అంటుంటే… తెలంగాణా సిఎం కేసీఆర్ కు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక్క మాట “ప్రతిపక్షం” అంటున్నట్లున్నారు.

అందుకే ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేసే పనిలో ఉన్నారు. ఈ కారు వల్ల ఎక్కువగా దెబ్బతిన్న పార్టీ తెలుగుదేశం. ఈ పార్టీలో వారంతా ఒక్కొక్కరిగా ‘గులాభీ’ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా కారెక్కిన ఎర్రబెల్లి ఇలా ఒక్కొక్కరిగా కాకుండా టి-టిడిపి మొత్తాన్ని కారులో విలీనం చేయమంటున్నారు. ఇందులో కూడా మెగాస్టార్ జ్ఞప్తికి రాకుండా మానరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

“విలీనం” అన్న పదానికి గొప్ప “క్రేజ్” తీసుకువచ్చిన వారిలో చిరు ప్రముఖులు. ఆయన ఎంతో ఆర్భాటంగా స్థాపించిన “ప్రజారాజ్యం” పార్టీని కేవలం 18 నెలలలోనే కాంగ్రెస్ లో ‘విలీనం’ చేసి పార్టీ భాధ్యతలు మోయలేని వారికి ఒక చక్కటి మార్గాన్ని చూపారు. ఇప్పుడు టి-టి.డి.పి కూడా ఆ మార్గాన్నే ఎంచుకోవాలని కారెక్కిన తమ్ముళ్ళు చంద్రబాబు గారికి ఇస్తున్న సలహాలు! మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఆ విధంగా దారి తీస్తాయా? లేక పడి లేచిన కెరటంలా టిడిపి మళ్ళీ పుంజుకుంటుందా? కాలమే సమాధానం చెప్పాలి.