Megastar Chiranjeeviమంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాధ్ రెడ్డి వంటి కొందరు ఇంతకాలంగా పవన్‌ కళ్యాణ్‌- చంద్రబాబు నాయుడులని విమర్శించడానికే పరిమితం అయ్యేవారు. టిడిపి, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి నష్టం కలుగుతుంది కనుక ఆ రెండూ కలవకూడదని వైసీపీ నేతలు కోరుకొంటున్నారు. కనుక వారి విమర్శలు… వాటి వెనుక వారి భయాందోళనలని అర్దం చేసుకోవచ్చు.

కానీ చాలా కాలంగా రాజకీయాలకి దూరంగా ఉన్న చిరంజీవిపై కూడా ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండటం చూస్తే వైసీపీ వ్యూహం మార్చిన్నట్లు కనిపిస్తోంది. ఇటు నుంచి సాధ్యం కాకపోతే అటు నుంచి నరుక్కురమ్మన్నట్లు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుంది.

టిడిపి-జనసేనలు పొత్తులు పెట్టుకోవడం ఎలాగూ ఖాయం అని గ్రహించడంతో వారికి చిరంజీవి కూడా మద్దతు ఇవ్వకుండా అడ్డుకొనేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టిన్నట్లున్నారు. వచ్చే ఎన్నికలలో చిరంజీవి తప్పకుండా తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి, జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. కనుక ఇప్పటి నుంచే చిరంజీవిపై ఈవిదంగా బురద జల్లుతూ వీలైనంతవరకు రాజకీయాలకి, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి దూరంగా ఉంచేందుకే చిరంజీవిని టార్గెట్ చేసే బాధ్యత రోజా స్వీకరించిన్నట్లున్నారు.

కానీ తన శాఖ గురించి, రాష్ట్రాభివృధ్ది గురించి మాట్లాడకుండా ఎల్లప్పుడూ మెగా, నారా ఫ్యామిలీలని తిడుతూ కాలక్షేపం చేస్తుంటే ప్రజల దృష్టిలో ఆమె పలుచనవుతారని గ్రహించిన్నట్లు లేదు. గత ఎన్నికలలోనే ఆమె చాలా స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆమె ఇంకా ఇలాగే మాట్లాడుతుంటే ఈసారి మెగాభిమానులు, నందమూరి అభిమానులు అందరూ కలిసి వచ్చే ఎన్నికలలో డిపాజిట్ కూడా దక్కకుండా చేసినా ఆశ్చర్యం లేదు.