Ravi Teja Chiranjeeviఊహించిన దాని కన్నా చాలా పెద్ద మొత్తంలో దక్కిన సక్సెస్ వల్ల చిరంజీవి కళ్ళకు పొరలు కమ్మేసిందేమో. ఈ మాట అంటున్నది వేరెవరో అయితే ఇతర ఉద్దేశాలు ఆపాదించవచ్చు. వాల్తేరు వీరయ్యలో స్వయానా తమ్ముడిగా నటించిన మాస్ మహారాజా రవితేజ అభిమానులే ఫీలవుతున్న సందర్భమిది. నిన్న వరంగల్ లో జరిగిన సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, జన సందోహాన్ని చూసి మెగాస్టార్ కి కొత్త ఉత్సాహం వచ్చింది. దానికి తోడు టీమ్ తో పాటు వచ్చిన మందిమాగధుల పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బు అయిపోయి తానేం మాట్లాడుతున్నారో సరిచూసుకున్నట్టు లేరు.

రిలీజైనప్పటి నుంచి రవితేజ పోస్టర్ ని తన లుంగీతో తుడిచే ప్రస్తావన పదే పదే పలు ఈవెంట్ల ఇంటర్వ్యూలలో తీసుకొచ్చిన చిరంజీవి ఇక్కడా అదే రిపీట్ చేశారు. ఇంతకు ముందు ఇలాంటి సీన్ ఎప్పుడూ రాలేదు ఎవరూ చేయలేదన్న రేంజ్ లో ప్రొజెక్ట్ చేశారు. సరే చెప్పుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మాస్ రాజాని చిన్న హీరో అని సంబోధించడం సబబుగా లేదు. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ఆజ్ కా గూండా రాజ్ టైంలో తను సైడ్ ఆర్టిస్ట్ కావొచ్చు. అన్నయ్య చేసేటప్పుడు చిన్న హీరో ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాదుగా. రొటీన్ గా ఉందని అందరూ కామెంట్ చేసిన ధమాకా వంద కోట్ల గ్రాస్ రాబట్టిన స్టామినాకు తక్కువ చేసి చూడగలమా.

రేంజ్ గురించి మాట్లాడుకుంటే రవితేజ ఎవరికీ తీసిపోడని అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు చిన్న హీరో అనే మాటే అవమానించడం కిందకు వస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ కలిసి ఉంటే కలదు సుఖం సినిమాలో తన స్థాయిలో మార్కెట్ లో దరిదాపుల్లో లేని హరనాథ్ కాళ్ళు పట్టుకుంటారు. ఇది సన్నివేశానికి అనుగుణంగా చేసిన పని. ముద్దుల మొగుడులో బాలకృష్ణని మీనా దారుణంగా అవమానిస్తుంది. చంద్రలేఖలో నాగార్జున సంజయ్ దత్ పాదాలు తాకుతాడు. ఘరానా మొగుడులో నగ్మా చేతిలో చిరంజీవి చెంపదెబ్బ తినడం వివాదమే. స్నేహం కోసంలో ఇదే చిరు విజయ్ కుమార్ చెప్పులు మోస్తాడు. ఇవన్నీ కథ డిమాండ్ మేరకు చేసినవే.

వాటినెవరూ అంతగా పబ్లిసిటీ చేయలేదే. ఎమోషన్ పండించడం కోసం రాసుకున్న పంచె సీన్ లో చేసిందాన్ని ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. చిన్న హీరో అనడం పట్ల రవితేజ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు రామ్ చరణ్ తన స్పీచ్ లో రవి అంటూ వయసులో చాలా పెద్దయిన హీరోని ఏకవచనంతో సంబోధించడం మింగుడు పడటం లేదు. చిత్తానికి ఏదో అనేసుకుంటూ పోవడం వల్ల కలిగే పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో చిరు చరణ్ లకు తెలియనిది కాదు. అయినా అత్యుత్సాహంలో ఇలా ప్రవర్తించడం వల్ల అవతలి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బ తింటాయని గుర్తించపోతే ఎలా.