Chiranjeevi was honoured with Indian Film Personality of the Year Award for 2022కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2022ని ప్రకటించింది. ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-53లో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేశారు.

ఇదివరకు వహీదా రెహమాన్, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజనీకాంత్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, సలీమ్‌ ఖాన్‌, బిశ్వజిత్‌ ఛటర్జీ, ప్రసూన్‌ జోషి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జి.కిషన్‌రెడ్డి చిరంజీవికి అభినందనలు తెలియజేశారు.

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయనను ఆహ్వానించడంతో బిజెపిలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తోందంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ విశాఖ వచ్చినప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయినప్పుడు జనసేనను పార్టీలో విలీనం చేసి చిరంజీవితో సహా ముగ్గురు మెగా సోదరులు బిజెపిలో చేరాలని కోరారని ఊహాగానాలు వినిపించాయి. అయితే పవన్‌ కళ్యాణ్‌ వాటిని ఖండించలేదు. ధృవీకరించలేదు.

కానీ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ తర్వాత నుంచి పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ప్రసంగాలలో, జనసేన వైఖరిలో ఓ స్పష్టమైన మార్పు వచ్చింది. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, నేను ముఖ్యమంత్రినయితే అంటూ… పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు. ఆయనకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఇటీవలే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు చెప్పారు.

చిరంజీవికి ఈ అవార్డు ప్రకటించిన రోజునే అంటే నిన్ననే హైదరాబాద్‌లో యర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నేను ఏదైనా మనస్ఫూర్తిగా అనుకొంటే అది సాధించేవరకు పట్టు విడవను. కానీ మనసులో ధృఢమైన సంకల్పం లేనప్పుడు ఆ పని పూర్తిచేయలేను. అందుకే నేను రాజకీయాలలో ప్రవేశించి ఇమడలేక మళ్ళీ సినీ పరిశ్రమలోకి వచ్చేశాను. రాజకీయాలలో రాణించాలంటే సున్నితంగా ఉంటే కుదరదు. ఎదుటవారు ఓ మాట అన్నా పడాలి. అవసరమైతే ఎదుటవారిని ఓ మాట అనగలగాలి. నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి ఆ నేర్పు, ఓర్పు రెండూ ఉన్నాయి. కనుక ఏదో ఓ రోజు అతను రాజకీయాలలో అత్యున్నతమైన స్థానం చేరుకొంటాడు. అది అందరూ చూస్తారు,” అని అన్నారు.

అంటే చిరంజీవి రాజకీయాలలోకి రాలేనని మరోసారి స్పష్టం చేసినట్లే అర్దం అవుతోంది. కానీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో అత్యున్నత స్థాయిలో చూస్తారంటే బహుశః ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడని చెపుతున్నట్లు అర్దం అవుతోంది. తమ్ముడికి మద్దతు ఇస్తానని చిరంజీవి ఇదివరకే ప్రకటించారు.

ఇప్పుడు బిజెపికి కూడా పవన్‌ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరిస్తున్నట్లు సోమూ వీర్రాజు ప్రకటించారు. కనుక రాబోయే ఎన్నికలలో బిజెపి, జనసేనలకు లేదా జనసేనను విలీనం చేసుకొన్న బిజెపికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగబోతున్న పవన్‌ కళ్యాణ్‌కి మెగాస్టార్ చిరంజీవితో సహా అందరూ మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

బహుశః ఆ ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని ఈవిదంగా దువ్వుటున్నట్లుంది. చిరంజీవి ఈ అవార్డుకి అన్నివిదాల అర్హుడు కూడా! కనుక దీంతో ఆయనను గౌరవించినట్లు ఉంటుంది. ఏపీలో బిజెపి భవిష్యత్‌ రాజకీయ అవసరాలకు చిరంజీవి మద్దతు అవసరమని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించి ఉండవచ్చు. అలాగని పూర్తిగా రాజకీయకోణంలో నుంచే దీనిని చూడవలసిన అవసరం లేదు. కానీ ఆ కోణం కూడా కనిపిస్తోంది.