Chiranjeevi Godfather Big Minus was salman bhaiమెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేస్తున్నారని ప్రకటించగానే, దర్శకుడుగా ఎవర్ని ఎంచుకుంటారు అనే ప్రశ్న సినీ పరిశ్రమలో చక్కర్లు కొట్టింది. చాలా మంది పేర్లు వినపడినా ఆఖరికి మోహన్ రాజా పేరు ని ఖరారు చేశారు మెగాస్టార్. మోహన్ రాజా కి రీమేక్ రాజా అని పేరుంది. ఎందుకంటే ఆయన తొలి సినిమా నుండి ఎక్కువ రీమేక్ సినిమాలే చేసారు. హనుమాన్ జంక్షన్, జయం, వర్షం ఇలా తొలి నాళ్ళలో ఎక్కువ రీమేక్ లే చేసారు మోహన్ రాజా. తన మీద ఉన్న రీమేక్ ముద్ర పోగొట్టుకోవడానికి తనీ ఒరువన్ (ధ్రువ) లాంటి హిట్ సినిమా తీశారు మోహన్ రాజా.

లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం మోహన్ రాజా చేసిన మార్పులు బాగా నచ్చి మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాని మొదలు పెట్టారు. ఈరోజు విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా మిక్స్ డ్ టాక్ తో ముందుకెళ్తుంది. ఆచార్య సినిమా పరాజయంతో నిరాశచెందిన అభిమానుల్లో గాడ్ ఫాదర్ సినిమా కొంత ఉత్సాహాన్ని నింపింది. అభిమానులు తమ ఆనందాన్ని థియేటర్ ఎదుట టపాసులు కాల్చి తెలియజేస్తున్నారు.

మెగాస్టార్ పోషించిన బ్రహ్మ పాత్రని బాగా మలిచారు. మెగాస్టార్ ఇమేజ్ కి తగినట్లు చేసిన మార్పులు అభిమానులను సంతృప్తి పరిచాయి. హీరోయిన్, డాన్సులు లేకపోయినా సినిమాలో ప్రేక్షకులు లీనమై చూస్తున్నారంటే దానికి మోహన్ రాజా కథనమే కారణం. అయితే ఒక చిన్న పొరపాటు చేసారు మోహన్ రాజా. మలయాళం లో లూసిఫర్ పాత్ర ఉన్నంత శక్తివవంతంగా తెలుగులో బ్రహ్మ పాత్ర లేదు. మెగాస్టార్ ఆహార్యం, అయనకు చేసిన మేకప్, చిరంజీవి పాత్రని శక్తీ హీనంగా ఉన్నట్లు చూపించాయి. బ్రహ్మ పాత్ర లో ధీరత్వాన్ని తెర మీద అంత గొప్పగా ఆవిష్కరించడంలో మోహన్ రాజా తడబడ్డారు.

ఇక అతిధి పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్ ని మరీ సిల్లీ గా చూపించారు. సల్మాన్ పాత్ర తెరమీద కనిపించినపుడు, పోరాటాలు చేస్తున్నపుడు ప్రేక్షకుల్లో ఏమాత్రం ఉత్సుకత కలుగదు. ఆ సన్నివేశాల్లో వాడిన గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. సల్మాన్ ఉన్న సన్నివేశాలన్నీ సాదా సీదాగా సాగుతూ ప్రేక్షకుడి ఊహకందేటట్లు చిత్రీకరించడం పొరపాటు. అయితే సత్యదేవ్ పాత్రని ముగించిన తీరు.. సినిమా నిడివిని తగ్గించడానికి, ఒరిజినల్ కథలో ఉన్న సాగతీత తీసేయడానికి దోహదపడింది.

క్లైమాక్స్ లో పాట పెట్టి అభిమానులని అలరింపచేసిన మోహన్ రాజా, మెగాస్టార్ కి ఒక రిలీఫ్ ని అయితే ఇచ్చారు. ఒకప్పుడు చిరు వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ‘హిట్లర్’ సినిమా ద్వారా ఎడిటర్ మోహన్ హిట్ ఇస్తే, ఇప్పుడు ఆయన తనయుడు మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ ద్వారా రిలీఫ్ ఇచ్చారు మెగా ఫాన్స్ కి.. గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్న ఈ చిన్న చిన్న లోపాలను సరిచేసుకుని ఉంటే విజయం మరింత వేగంగా తలుపుతట్టేది. గాడ్ ఫాదర్ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని వెళ్లిన ప్రతి చోటా చెప్పిన మోహన్ రాజా మాటలు రాబోయే రోజుల్లో నిజమవుతాయేమో చూద్దాం.