Chiranjeevi God Father with salman khan is it works this timeమెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా అక్టోబ‌ర్ 5న‌ తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతుంది. టాలీవుడ్‌లో చిరంజీవి స్టార్ హీరో. అయితే ఆయ‌న‌కు సైరా న‌ర‌సింహా రెడ్డి, ఆచార్య చిత్రాలు ప‌రాభ‌వాల‌నే మిగిల్చాయి. ఈ క్ర‌మంలో చిరంజీవి చేస్తోన్న మ‌రో ప్ర‌య‌త్నం గాడ్ ఫాద‌ర్‌. నిజానికి ఇది మ‌లయాళ చిత్రం లూసిఫ‌ర్‌కి రీమేక్‌. మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ఆ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేసింది. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ ఈ సినిమాను చూసుంటారన‌టంలో సందేహ‌మే లేదు. మ‌రేమైందో ఏమో .. మ‌ళ్లీ రీమేక్ హ‌క్కుల‌ను కొని సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇది మెగాభిమానుల‌కు మింగుడ‌ప‌డ‌ని విష‌యం. కానీ ఏమీ అన‌లేని ప‌రిస్థితి.

చిరంజీవి అనుకుంటే స్ట్రైట్ మూవీ చేయ‌వ‌చ్చు క‌దా. రీమేక్ చేయాల్సిన అవ‌స‌రం ఏంటి? అనేది అంద‌రి మ‌న‌స్సుల్లోని ప్ర‌శ్న‌. కానీ ఏం చేస్తాం. లూసిఫ‌ర్‌ను గాడ్‌ఫాద‌ర్ పేరుతో రీమేక్ చేసేశారు. రిలీజ్‌కి సినిమా రెడీ అయిపోయింది. అయితే చిరంజీవి అండ్ టీమ్ రీమేక్ విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్‌ను తీసుకున్నారు. చిరంజీవితో స్టెప్పులేయించి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను చొప్పించారు. ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ అనుచరుడిగా పృథ్వీరాజ్ చేసిన పాత్ర‌ను తెలుగులో స‌ల్మాన్ ఖాన్ చేయ‌టం. నిజం చెప్పాలంటే స‌ల్మాన్ ఖాన్ న‌టించిన తొలి స్ట్ర‌యిట్ మూవీ ఇదే అని చెప్పాలి.

స‌ల్మాన్ వంటి బాలీవుడ్ అగ్ర హీరో న‌టించ‌టంతో సినిమా మార్కెటింగ్ స్ట్రాట‌జీని మేక‌ర్స్ మార్చేశారు. తెలుగుతో పాటు హిందీలోనూ గాడ్‌ఫాద‌ర్‌ను రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. రిలీజ్ చేయ‌టం త‌ప్పేమీ కాక‌పోవ‌చ్చు. కానీ క‌రోనా త‌ర్వాత‌ బాలీవుడ్ మార్కెట్ ద‌య‌నీయంగా త‌యారైంది. అక్క‌డ అహా, ఓహో అనిపించుకున్న అగ్ర హీరోల ప‌రిస్థితి ఇప్పుడు బాగోలేదు. స‌ల్మాన్ ఖాన్ చేసిన‌ గ‌త సినిమాలు అయితే బొక్క బోర్లా ప‌డ్డాయి. ఈ త‌రుణంలో స‌ల్మాన్ స‌పోర్ట్ తీసుకుని చిరంజీవి బాలీవుడ్‌లో గాడ్ ఫాద‌ర్‌ను రిలీజ్ చేయటం క‌రెక్ట్ కాద‌ని ఓ వ‌ర్గం వాద‌న‌. సైరా న‌ర‌సింహా రెడ్డి సినిమాతో చిరంజీవి బాలీవుడ్‌లో స‌త్తా చాటాల‌నుకున్నారు. కానీ సినిమా బాగో లేక‌పోవ‌టంతో నిరాశ ఎదురైంది. త‌ర్వాత ట్రిపుల్ ఆర్‌లో చేసిన రామ్‌చ‌ర‌ణ్ న‌టించాడు క‌దా.. కాబ‌ట్టి ఆచార్య‌తో చిరు మ‌ళ్లీ బాలీవుడ్‌లో మ‌రో ట్రై చేస్తాడ‌ని అనుకున్నారు. కానీ ఎందుక‌నో మెగాస్టార్ ఆ ప్ర‌య‌త్నాన్ని ప‌క్క‌న పెట్టేశాడు.

అయితే గాడ్‌ఫాద‌ర్‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌నేది చిరు ప్ర‌య‌త్నం. కానీ గాడ్ ఫాద‌ర్ స్ట్రాట‌జీ అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా అనేది తెలియ‌టం లేదు. మ‌న టాలీవుడ్ స్టార్స్ ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. త‌మ సత్తాను చాటిన వారే. త్వ‌ర‌లోనే మ‌హేష్ కూడా ఈ లిస్టులో చేర‌బోతున్నారు. అయితే వీరి లిస్టులో చిరంజీవి చేరాల‌ని గ‌ట్టిగా కోరుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఆయ‌న ఆశ ప‌డ‌టంతో త‌ప్పు లేదు. కానీ గాడ్‌ఫాద‌ర్ వంటి సినిమాతో అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌టంపై అనుమానాలు నెల‌కొన్నాయి.