Chiranjeevi- final decission on politicsమొన్న ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వస్తారని, బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా మీడియాముఖంగా తాము చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇదిగో చేరుతున్నారు అదిగో చేరుతున్నారు అంటూ చేసిన హడావిడి తప్ప ఆ విషయం ముందుకు వెళ్ళలేదు. చాన్నాళ్లకు ఈ విషయం పై మెగాస్టార్ ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది.

రాజకీయాల్లోకి తిరిగవచ్చే అవకాశం గురించి, బీజేపీలో చేరే అంశం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు. “అది పూర్తిగా వాళ్ల ఆలోచన, ఆశ. దానిపై నేనెలా స్పందిస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే” అంటూ సమాధానమిచ్చారు చిరంజీవి. దీన్నిబట్టి చిరంజీవి ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వచ్చేసినట్టే అనుకోవాలి. ఒకవేళ వచ్చినా ఆయన జనసేనను కాదని వేరే పార్టీని చూస్తారా అనేది అనుమానమే.

అది అలా ఉంటే… చిరంజీవి తదుపరి చిత్రం సైరా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా మేకింగ్ వీడియో సినిమా మీద అంచనాలు భారీగా పెంచేసింది. ఈ సినిమా కోసం ఈ నెల 20న విడుదల చెయ్యడానికి ఒక సరికొత్త టీజర్ రెడీ చేశారట చిత్రబృందం. ఆ టీజర్ చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22) సందర్భంగా విడుదల కాబోతుంది. ఆ టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అభిమానులు వెయ్యి కళ్ళతో దానికోసం ఎదురు చూస్తున్నారు.