Chiranjeevi-dasari narayana rao press meetచాలా కాలం తర్వాత మెగా అభిమానులకు అమితమైన సంతోషాన్ని ఇచ్చారు చిరంజీవి. మా సినీ అవార్డ్స్ లో చిరు స్టెప్పులు చూసి రెట్టించిన ఉత్సాహంతో అభిమానులను 24 గంటలు కూడా గడవక ముందే పాతాళంలో పడేసారు మెగాస్టార్. ‘ప్రజారాజ్యం’ స్థాపనతో ఆకాశమే హద్దుగా సాగిన అభిమానం ఫలితాల తర్వాత ఎలా నీరుగారి పోయిందో… సినీ అవార్డ్స్ లో మెగా డ్యాన్స్ మూవ్ మెంట్స్ చూసిన తర్వాత… వైసీపీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అలాగే నీరుగారిపోయింది.

‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినపుడు కూడా పెద్దగా తల దించుకోని అభిమాన గణం, అవినీతి పార్టీగా ముద్రపడి, ముఖ్యంగా మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యతిరేకించిన వైసీపీ నేతలతో మమేకమైన తర్వాత తలదించుకోవడం కాదు, మెగాస్టార్ కు అసలు రాజకీయాలు ఒంటపట్టవు అంటూ తలదించుకుంటున్నారు. ‘ప్రజారాజ్యం’ పార్టీని ఏ ఉద్దేశం కోసమైతే స్థాపించారో, తర్వాత అదే లక్ష్యాన్ని మట్టునపెట్టి కాంగ్రెస్ లో కలిసిపోయారు. ప్రస్తుతం ‘లక్ష్యం’ లేకుండా ఉన్న చిరు గారికి, వైసీపీ నుండి కూడా భారీ “ఆఫర్” వస్తే, బహుశా జగన్ పార్టీలోకి కూడా వెళ్లేందుకు సిద్ధమేనని పరోక్షంగా తెలుపుతున్నారా? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత శోచనీయమైన విషయమేమిటంటే… ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ప్రెస్ మీట్లో సరిగా ప్రసంగించలేక తడబాటుకు గురి కావడం అన్నది ఎవరూ చిరుకున్న రాజకీయ పరిజ్ఞానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒక సినీ నటుడిగా తమ హీరో గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో, ఒక రాజకీయ నాయకుడిగా దానికి పూర్తి వ్యతిరేకత వ్యక్తపరచాల్సి వస్తోందని మెగా అభిమానుల ఆవేదన చిరు ఎప్పటికీ అర్ధం చేసుకునేనో..? అసలు అర్ధమవుతుందంటారా..!?