Chiranjeevi fans - fires on amaravati farmers-జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసం ముట్టడికి అమరావతి ఐకాస నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు.

ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల పోలీసులకు ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా చిరంజీవి అభిమానులు అమరావతి రైతులపై దూషణలకు దిగారు, చిరంజీవి జోలికి వస్తే ఊరుకునేది లేదు అని హూంకరించారు.

అయితే ఈ దూషణలు, బెదిరింపులు న్యాయమా అనేదివారే ఆలోచించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. “రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి. అప్పటినుండి ప్రభుత్వం తన అభిప్రాయం మార్చుకునేలా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అటువంటి తరుణంలో ఎవరూ అడగకుండా చిరంజీవి ముందుకు వచ్చి మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారు,” అని వారు అంటున్నారు.

“చిరంజీవి జోలికి రైతులు వెళ్ళలేదు. రైతుల జీవితాల్లోకే చిరంజీవి వచ్చారు. చిరంజీవి, జగన్ వంటి వారు ఎలా ఉన్నా… అభిమానులు రైతులు వంటి సామాన్యులే. వారు రైతుల బాధలను అర్ధం చేసుకుని వారి తరపున నిలబడాలి. అంతే గానీ రైతుల మీద దూషణలకు దిగడం ఎంతవరకూ సబబు?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.