chiranjeevi-fans-attack-on-theatre-and-tear-the-screenతమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడూ వెండితెరపై చూద్దామా అని మెగా అభిమానులు వేయి కళ్ళతో వేచిచూస్తున్నారు. దాదాపుగా పదేళ్ళ నుండి సాగిస్తున్న నిరీక్షణకు తెరపడబోతున్న నేపధ్యంలో… ఓ ధియేటర్ యాజమాన్యం మెగా అభిమానుల సహనాన్ని పరీక్షించింది. గుంటూరు జిల్లా, కొల్లూరులోని శ్రీనివాస ధియేటర్ యాజమాన్యం “ఖైదీ నంబర్ 150” బెనిఫిట్ షో ప్రదర్శిస్తామని చెప్పి ముందుగానే టికెట్లు విక్రయించింది.

దీంతో మెగాస్టార్ ను ముందుగా చూసేందుకు అభిమానులు ఒక రోజు ముందు నుండే… అంటే మంగళవారం అర్ధరాత్రి సమయం నుండే ధియేటర్ వద్ద వేచిచూసారు. రాత్రి 10 గంటల నుండి ధియేటర్ వద్దే పడిగాపులు పడిన అభిమానులకు, చివరికి ఓ చేదు వార్తను ధియేటర్ యాజమాన్యం చెప్పింది. బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతులు లభించలేదని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు మెగా అభిమానులు.

థియేటరుపై రాళ్ల దాడి చేస్తూ… ఆ తర్వాత హాల్లోకి ప్రవేశించి, వెండితెరను చించివేసి, హాలులోని కుర్చీలు ధ్వంసం చేసి రచ్చ రచ్చ చేశారు. అభిమానుల ప్రవర్తన చూసి అవాక్కైన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చినా, వారు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిమానుల అల్లరి చేష్టలకు పోలీసులు అడ్డుకట్ట వేసినప్పటికీ, లక్షల నష్టం వాటిల్లిందని థియేటర్ యాజమాన్యం వాపోయింది.