Chiranjeevi disappoint speech at Jayadev Audio Launchఓ మూడు రోజుల క్రితం రాజమౌళి ఓ సినీ వేదికపై చెప్పినట్లుగా… ఇటీవల కాలంలో కొత్తదనం లేనిదే చిన్న సినిమాల వైపుకు ప్రేక్షకులు చూడడం లేదన్నది స్పష్టం. అందుకే చిన్న సినిమాలకు కూడా కాసింత పబ్లిసిటీ కోసమని, అగ్ర హీరోలను, టాప్ డైరెక్టర్స్ ను పిలుస్తుండగా, వారు కూడా హాజరవుతూ ఎంతోకొంత పబ్లిసిటీ సాయం అందిస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా “జయదేవ్” అనే సినిమా ఆడియో వేడుకకు విచ్చేయడం ప్రాధాన్యతను దక్కించుకుంది.

ఈ వేడుకపై మెగాస్టార్ ఇచ్చే స్పీచ్ ‘జయదేవ్’ సినిమాకు ఎంతో దోహదపడుతుందని భావిస్తే… అది కాస్త ఇపుడు రివర్స్ కావడం ట్విస్ట్ ఇచ్చే అంశం. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవిని హీరోగా పరిచయం చేస్తూ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుకపై మెగాస్టార్ పస లేని ప్రసంగం శ్రోతలకు ఇబ్బందికరంగా మారడం ఊహించని విషయం. ‘జయదేవ్’ సినిమా ఓపెనింగ్స్ కు కాస్త దోహదపడే అంశాల గురించి చెప్పాల్సింది పోయి, అది పక్కదారి పట్టే విధంగా చిరు ప్రసంగం ఉండడం నిజంగా షాకే.

తాను ఈ వేడుకకు విచ్చేయడానికి కారణం గంటా శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధమే అంటూ ఓపెన్ చేసిన చిరంజీవి ప్రసంగంలో… గంటా రవిని హీరోను చేయడం కంటే కూడా శ్రీనివాసరావును హీరోగా కీర్తిస్తూ ప్రశంసలు కురిపించడం విశేషం. చిరు ప్రసంగానికి మురిసిపోతూ చిరునవ్వులు చిందించడం ‘గంటా’ వారి వంతయ్యింది. ఇక సినిమా గురించి మాట్లాడిన కాసేపు కూడా ‘ఏదో బలవంతంగా పట్టి పట్టి మాట్లాడినట్లు’ ఉండడం, సినీ వేడుకలపై చిరును కొత్తగా చూసినట్లుంది. సహజంగా రాజకీయ వేడుకలలో చిరు ఇలా ప్రసంగిస్తూ ఉంటారు.

బహుశా ‘జయదేవ్’ సినిమా గురించి ఎక్కువగా చెప్తే, విడుదల తర్వాత నాలుక కరచుకోవాల్సి వస్తుందేమో అన్న భావనలోనే చిరు ప్రసంగం మొత్తం చాలా జాగ్రత్తగా సాగింది తప్ప, చిరు రాక వలన “జయదేవ్” సినిమాకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరలేదని చెప్పవచ్చు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జయంత్ దర్శకత్వంలో తాను గతంలో నటించాను అన్న విషయాన్ని కూడా చిరు ప్రస్తావించలేదంటే… బహుశా చిరు తనువు అక్కడే ఉన్నా, మనసు ఇంకెక్కడో ఉందన్న భావాలను వీక్షకులకు కలిగించారు.