Chiranjeevi condolence to kannababuసోదరుడు సురేష్‌ హఠాన్మరణంతో బాధపడుతున్న వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబును కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. కాకినాడలోని కన్నబాబు నివాసానికి చేరుకున్న ఆయన ముందుగా తండ్రి సత్యనారాయణ, మరో సోదరుడు, దర్శకుడు కల్యాణ్‌కృష్ణలను పరామర్శించి సానుభూతిని తెలిపారు. చిరంజీవిని చూసిన తరువాత కన్నబాబు, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవడం గమనార్హం.

కురసాల కన్నబాబు గతంలో ప్రజారాజ్యంలో క్రియాశీలకం ఉన్నారు. ఆ తరువాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాకా, 2014 ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్నారు. అయితే కన్నబాబుని ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. చిరంజీవిని రాజకీయంగా వెన్నుపోటు పొడిచింది కన్నబాబేనని ఆరోపించారు.

‘అన్నయ్యను కొంతమంది వెన్నుపోటు పొడిచారు.. వారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతాను..’ అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే చిరంజీవి కన్నబాబు ఇంటికి వెళ్లి పరామర్శించడం ద్వారా పవన్ కళ్యాణ్ ని చిన్నబుచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు మాత్రం వెన్నుపోటు పొడిస్తే చిరంజీవి వెళ్లరు కదా, ఈ ఘటన పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవరాహిత్యానికి మరో నిదర్శనం అంటూ హేళన చేస్తున్నారు.