Chiranjeevi comments on Gautamiputra--Satakarni Tax Exemptionఅమరావతి బ్యాక్ గ్రౌండ్ తో “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాను నిర్మించిన చిత్ర నిర్మాతలకు ఏపీ సర్కార్ ప్రకటించిన పన్ను మినహాయింపు ప్రకటన విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా గతంలో ‘రుద్రమదేవి’ సినిమాకు ఇవ్వని పన్ను మినహాయింపును ఈ సినిమాకు ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘రుద్రమదేవి’ దర్శకనిర్మాత గుణశేఖర్ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై స్పందించారు. 2015లో విడుదలైన గుణశేఖర్ చిత్రం ‘రుద్రమదేవి’ సినిమాకు ఇచ్చి, ఇప్పుడు ఈ చిత్రానికీ ఇచ్చి వుంటే, ఓహో… ఇలాంటి సినిమాలను నిర్మిస్తే, పన్ను మినహాయింపు ప్రోత్సాహకాలు లభిస్తాయని అనుకోవచ్చు. కానీ అప్పుడు ‘రుద్రమదేవి’కి ఇవ్వకపోవడం, దీనికి ఇవ్వడం విమర్శలకు తావిచ్చినట్లయ్యిందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

గత చరిత్రను చూపే సినిమాలకు రాయితీలు ఇవ్వడం మంచిదేనని, ‘రుద్రమదేవి’కి కూడా రాయితీలు ఇచ్చుంటే బాగుండేదని, ఇప్పుడు బాలయ్య సినిమాకు మాత్రమే రాయితీ ఇవ్వడమేంటని అడిగారు. ‘రుద్రమదేవి’ సైతం చరిత్రకు సంబంధించిన సినిమానేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు మెగాస్టార్. మొత్తానికి బాలయ్య సినిమాకు ఇచ్చిన పన్ను, ఏపీ సర్కార్ కు పెద్ద తలనొప్పి పోటుగా మారబోతుందా? అనేది చూడాలి.