Megastar Chiranjeeviవాల్తేరు వీరయ్యకు వచ్చిన స్పందన చిరంజీవికి మాములు ఆనందాన్ని ఇచ్చినట్టు కనిపించడం లేదు. సక్సెస్ మీట్ లో సుదీర్ఘంగా ప్రసంగించిన మెగాస్టార్ అందులో చురకలు, క్లాసులు, ప్రశంసలు అన్నీ జొప్పించేశారు. దర్శకుడు బాబీని ఆకాశానికెత్తేస్తూ కొందరు డైరెక్టర్లు చెప్పిన మాట వినరని తాము రాసిందే రైట్ ఎవరెన్ని మార్పులు చెప్పినా వినకుండా గుడ్డిగా వెళ్లిపోవడం వల్ల దెబ్బ తింటారని కాసింత ఉద్వేగంగానే అన్నారు. ఇంతగా చెప్పారంటే ఆయన స్వానుభవమే అయ్యుంటుందనేది ఈజీగా అర్థమైపోతుంది. కంబ్యాక్ ఇచ్చాక చిరుని తీవ్ర నిరాశకు గురి చేసిన మెగా డిజాస్టర్ ఆచార్య తీసిన కొరటాల గురించేనని అక్కడే గుసగుసలు వినిపించాయి.

నేరుగా ప్రస్తావన చేయకపోయినా చిరంజీవి ఆ సినిమా గురించి ఎంతగా ఫీలవుతున్నారో పలు సందర్భాల్లో వింటూనే ఉన్నాం. ఇంగ్లీష్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ ఇన్ డైరెక్ట్ గా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇదంతా ఖైదీ నెంబర్ 150, సైరా టైంలో జరగలేదు. గాడ్ ఫాదర్ మోహన్ రాజాను పల్లెత్తు మాట అనలేదు. కానీ ఇలా ఈవెంట్లలో డైరెక్టర్లకు క్లాస్ పీకడం చూస్తే అది కొరటాల శివ గురించేనని మీడియానే కాదు సగటు నెటిజెన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. నాణేనికి రెండు వైపులా ఉన్నట్టు పూర్తి నిందను దర్శకుడి మీదకు వేయడం కూడా కరెక్ట్ కాదనే కామెంట్ ని కొట్టిపారేయలేం.

అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పదే పదే నేరుగానో ఇంకో విధంగానో తవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. హిట్ ఇచ్చిన దర్శకుడి గురించి ఎంతైనా గొప్పగా చెప్పుకోవచ్చు. గాడ్ ఫాదర్ మోహన్ రాజాని ఇంతకన్నా ఎక్కువ పొగడ్తల వర్షంలో ముంచెత్తడం ఇంకా గుర్తేగా. చివరికి ఏమయ్యింది. స్వంతంగా రిలీజ్ చేసుకున్నాం కాబట్టి లాభాలొచ్చాయని నిర్మాత చెప్పుకోవడం తప్పించి నిజంగా అది మెగాస్టార్ రేంజ్ లో ఆడలేదన్నది వాస్తవం. ఇప్పుడు వాల్తేరు వీరయ్య పెద్ద రేంజ్ కి వెళ్లొచ్చు. అది తేలడానికి ఇంకా టైం పడుతుంది కానీ ఈలోగా ఈ చర్చలన్నీ అవసరం లేనివే.

నేనేమైనా క్లాస్ తీసుకుంటున్నానా అని చెప్పిన చిరంజీవి నిజంగా చేసింది ఆ పనే. షూటింగులో బయటికి కనిపించకుండా విపరీతంగా కష్టపడుతూ దాని మీద బ్రతికే సినీ కార్మికుల గురించి చెప్పిన మాటలు ఆయనే స్వయంగా షూట్ చేశానని చెప్పిన వీడియోలు ఆకట్టుకున్నాయి. ఇది పక్కనపెడితే ప్రొడక్షన్ లో వేస్టేజ్ వల్ల నిర్మాతల మీద పడుతున్న భారం గురించి, ఎవరినీ నేరుగా అనలేదు మీరేమీ హెడ్డింగులు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేసిన చిరు మొత్తానికి కొంత క్లారిటీ కొంత కన్ఫ్యూజన్ తోనే మాట్లాడారు. వాల్తేరు వీరయ్య విషయంలో ఇంతగా ఎగ్జైట్ అయిపోయి బాబీని విపరీతంగా పొగిడేయడం బాగానే ఉంది కానీ ఇదే జోరు పండగ అయ్యాక కూడా కొంత కాలం కొనసాగిస్తే బ్లాక్ బస్టర్ ట్యాగ్ కు న్యాయం జరిగినట్టే.