Chiranjeevi away from politics కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 2014 ఎన్నికల తరువాత అప్పుడప్పుడు కాంగ్రెస్ కార్యక్రమాలలో పాలు పంచుకున్నా ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. కాంగ్రెస్ లో కొనసాగడం వల్ల తన సోదరుడి జనసేన పార్టీకి ఇబ్బంది అవుతుందని పైగా తనకు రాజకీయంగా ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో చిరంజీవి ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.