Chiranjeevi at Sri Kalahasthiఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే, అక్కడ అభిమాన జనసందోహమే కనపడేది. మెగాస్టార్ వస్తున్నారంటే కొన్ని లక్షల మంది జనాలు అవలీలగా చిరును చూడడానికి వచ్చేసేవారు. కానీ, ఈ ఒరవడి ‘ప్రజారాజ్యం’ కాంగ్రెస్ లో విలీనం అయిపోయిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. అభిమానులే బహిరంగంగా విమర్శించే స్థాయికి చిరు దిగిపోవడంతో పాటు, చిరు ఉన్న ప్రాంతంలో ఒక సాధారణ రాజకీయ నాయకుడికి ఉండే బలగం కూడా లేకుండా పోయింది.

అయితే ఇదంతా ‘ఖైదీ నంబర్ 150’ హడావుడి మొదలు కాకముందు. మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పైకి రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరు ఎక్కడికి వెళ్తున్నారంటే అక్కడికి మునుపటి మాదిరిగానే వేలు, లక్షల మంది వచ్చేస్తున్నారు. ఇందుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక అయ్యిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే తాజాగా శ్రీకాళహస్తిలో జరిగిన ఉదంతం కూడా మెగాస్టార్ స్థాయిని మరోసారి నిరూపించింది.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలో ఉన్న‌ రాజగోపుర మహాకుంబాభిషేకం క్రతువులో భాగంగా ఆదివారం నాడు విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ రాజ‌గోపురాన్ని ‘నవయుగ నిర్మాణ సంస్థ’ నిర్మించగా, ఈ కార్యక్రమానికి చిరు త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, చండీసహిత అతిరుద్రయాగంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున రావ‌డంతో ఆల‌యంలో తోపులాట చోటు చేసుకోవడంతో పాటు, శ్రీకాళహస్తి వీధులన్నీ చిరు అభిమానుల‌తో కిక్కిరిసిపోయాయి.