chiranjeevi-appointed-as-pcc-member-west-godavari-districtతాను చేసిన తొలి రాజకీయ ప్రసంగంలోనే ఈ ‘కాపు సంఘాల వారు ఎవరు? వారి సహకారం నాకేం అవసర్లేదు’ అంటూ కుల రాజకీయాలపై ఉద్వేగంగా ప్రసంగించిన ఘనత పవన్ కళ్యాణ్ సొంతం. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్ళు గడిచినా… కుల గుంపులోనే తాను ఉంటానని పరోక్షంగా చెప్పడం చిరంజీవి స్పెషాలిటీ. అవును… చిరంజీవి తాజాగా తీసుకున్న నిర్ణయంతో మరోసారి మెగాస్టార్ పై కులముద్ర పడేలా చేసింది. ‘ప్రజారాజ్యం’ను కాంగ్రెస్ లో కలిపి కేంద్రమంత్రి పదవిని అలంకరించిన చిరంజీవికి తాజాగా మరో పదవిని కాంగ్రెస్ కట్టపెట్టింది.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా మెగాస్టార్ చిరంజీవిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 మందిని పీసీసీ సభ్యులుగా జిల్లా నుంచి ఎంపిక చేయగా, చిరంజీవి స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి కావాలని కోరడంతో… కొవ్వూరు బ్లాక్ 1 నుండి పీసీసీ సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేత అమరజహా బేష్ రాజీనామా చేయించి, ఆ స్థానంలో చిరంజీవిని కట్టపెట్టారు. ఈ నెల 10వ తేదీన విజయవాడలో పీసీసీ సర్వసభ్య సమావేశం జరుగనుండగా, ఆపై పీసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.

ఏపీలో 13 జిల్లాలు ఉన్నా చిరు పశ్చిమ గోదావరి జిల్లానే ఎంపిక చేసుకోవడం వెనుక ఆంతర్యం తెలియనిది కాదు. తన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కోరినట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే చిరుపై కులముద్ర ఓ రేంజ్ లో ఉన్న నేపధ్యంలో… దానిని తొలగించుకునే దాని కన్నా, వాటిని బలపరిచే విధంగా వ్యవహరించడం మెగాస్టార్ కే చెల్లుబాటు అయ్యిందని చెప్పవచ్చు. ఈ విషయంలో చిరుకు మరియు ఆయన సోదరుడు, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా కనపడుతోంది.

కులాల మాట పక్కన పెడితే, బలం, బలగంతో నిమిత్తం లేకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి చిరు తన సొంత ప్రదేశాన్ని, తిరుపతిని ఎంచుకోగా, పవర్ స్టార్ మాత్రం అందుకు విరుద్ధంగా… తన సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా అనంతపురంను సెలక్ట్ చేసుకుని సవాల్ విసిరారు. అలాగే పదవి, అధికారం అనేవి తనకు ‘తుచ్చం’ అన్న పవన్ వ్యాఖ్యలకు, కేంద్రమంత్రి పదవి నుండి పార్టీ పదవి వరకు… ఏదైనా పదవి ముఖ్యం అనే చిరుకు ఎక్కడా పొంతన లేదు.

అంతిమంగా… చిరు, పవన్ ల మధ్య వ్యక్తిగత సంబంధాలు పక్కన పెడితే… రాజకీయ, సామాజిక పరమైన అంశాలకు వచ్చేపాటికి రెండు భిన్న ధృవాలని చెప్పడానికి… ప్రస్తుతం పార్టీ పదవి విషయంలో చిరు చూపించిన ఉత్సాహమే నిదర్శనంగా నిలుస్తోంది. రాజకీయాలలో పదవులపై మక్కువ లేకుండా ఎవరు ఉండరు. కానీ పదవులే ముఖ్యంగా అడుగులు వేసే “ముఖ్య” నేతలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడం విశేషం. విశేషం ఏమిటంటే… అప్పట్లో చిరు సిఎం సీటు కోసం కలలు కనగా, ప్రస్తుతం ఆ స్థానంలో ప్రతిపక్ష నేత ఊహలలో మునిగి తేలుతున్నారు.