chiranjeevi acharya new release dateనాలుగు నెలల ముందే సంక్రాంతి పండగకు నాలుగు పెద్ద సినిమాలు వచ్చేస్తాయని డేట్స్ ప్రకటించారు. తీరా సంక్రాంతి వచ్చేసరికి ప్రకటించిన ఆ నాలుగు తప్ప, ముందుగా డేట్ ఇవ్వని ‘బంగార్రాజు, కొన్ని చిన్న సినిమాలు వచ్చి ప్రేక్షకులను అసంతృప్తిలో నెట్టాయి.

కారణం కరోనానే కానీ, ఏపీ టికెట్ల ప్రభావమే గానీ, ఏదైనా ఈ సంక్రాంతి హంగామా టాలీవుడ్ కు ఏ మాత్రం జోష్ ని ఇవ్వలేకపోయింది. సంక్రాంతి సినిమాలతో పాటు ఫిబ్రవరిలో ప్రకటించిన ‘ఆచార్య’ కూడా వాయిదా వేస్తూ సంక్రాంతి రోజున ప్రకటన ఇవ్వగా, కనుమ రోజున కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

సంక్రాంతి నుండి ముందుగా వైదొలగిన మహేష్ ‘సర్కార్ వారి పాట’ రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 1వ తేదీన “ఆచార్య” విడుదల కానుంది అంటూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి ధృవీకరించారు. దీంతో మళ్ళీ పెద్ద హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని స్పష్టమైంది.

‘ఆచార్య’ కొత్త విడుదల తేదీతో ‘సర్కార్ వారి పాట’ మళ్ళీ వాయిదా కాబోతోందన్నది తేలిన విషయం. ఇంకా 45 రోజుల షూటింగ్ ఉన్న నేపధ్యంలో… ప్రస్తుతం మహేష్ ఉన్న పరిస్థితులలో ఏప్రిల్ 1వ తేదీకి విడుదల కావడం అసాధ్యం అన్నది అభిమానులకు ఇప్పటికే అర్ధం అయిపోగా, ‘ఆచార్య’ ప్రకటనతో స్పష్టత వచ్చేసింది.

ఇక ప్రభాస్ “రాధే శ్యామ్”ను మార్చిలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియాలో కరోనా కంట్రోల్ లోకి వచ్చి ప్రభుత్వాలు ధియేటర్లకు వెసులుబాటు కల్పిస్తే, మార్చి 17వ తేదీన ‘రాధే శ్యామ్’కు మోక్షం కలగవచ్చనేది లేటెస్ట్ టాక్.

కరోనా నియంత్రణలోకి వచ్చేవరకు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై ఎలాంటి ఆలోచనలు చేయకూడదని, ముఖ్యమైన అన్ని రాష్ట్రాలలో ధియేటర్లన్నీ ఓపెన్ అయ్యాకే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల గురించి ఓ ప్రకటన చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.

ఇటీవల ఏపీ సీఎంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ‘ఆచార్య’ కొత్త రిలీజ్ డేట్ రావడంతో, ఆ తేదీ లోపున ఏపీలో నెలకొన్న టికెట్ ధరల వివాదం సమసిపోతుందన్న అంచనాకు సినీ వర్గాలు వచ్చాయి. అయితే ఈ రిలీజ్ డేట్స్ ప్రకటనలపై సినీ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.

ఇలా ముందుగానే ప్రకటనలు చేయడం… తదుపరి ఏదొక కారణాలతో వాయిదాలు వేసుకోవడం… అనేది అభిమానుల సహనానికి పరీక్షలు పెడుతోన్న నేపధ్యంలో, కరోనా అంతా సర్దుమణిగిన తర్వాత రిలీజ్ డేట్ లను ప్రకటించడం ఉత్తమం అనేది సినీ ప్రేక్షకుల భావన.