Chiranjeevi-150th-movie-kaththi-controversy“కాలం కలిసి రాకపోతే ఏకే మేకై కూర్చుంటుంది” అంటారు పెద్దలు. బహుశా మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇది నిజమనిపిస్తుందేమో! ఆర్ధికంగా పక్కన పెడితే, మెగాస్టార్ 150వ సినిమా విషయంలో చిరుకు బొత్తిగా కాలం కలిసి వస్తున్నట్లు లేదు. కొన్ని సంవత్సరాల పాటు కధ కోసం వేచిచూసిన చిరు, ఎట్టకేలకు తమిళ “కత్తి” రీమేక్ కు ఓకే చెప్పారు. ఇది విని సంతోషించిన అభిమానుల ఆనందం ముగియక ముందే కధ విషయంలో తలెత్తిన వివాదం మెగాస్టార్ “కత్తి” మరింత ఆలస్యం కావడానికి కారణమమవుతోంది.

నరసింహారావు అనే రచయిత “కత్తి” సినిమా కధ నాదే అంటూ తెలుగు సినిమా రచయితల సంఘంలో నమోదైన ఫిర్యాదుపై కమిటీ వేసిన ఫిలిం చాంబర్ “కత్తి” సినిమా, నరసింహారావు కధ ఒకటేనని ధృవీకరించాయి. ఈ కధను 2006 నుండి ఇప్పటివరకు మూడు సార్లు రిజిస్టర్ చేసారు. మరోవైపు సదరు రచయిత వివాదం తేలకుండా తెలుగు “కత్తి”కి సహకరించేది లేదంటూ 24 విభాగాల ఫిల్మ్ వర్గాలు ప్రకటించాయి. దీంతో “కత్తి” సినిమా ఎప్పటికి మొదలవుతుందో అన్న ఆందోళన మెగా అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ఈ వివాదం స్పందించిన సదరు రచయిత నరసింహారావు, “తానూ కేవలం డబ్బుల కోసం ఈ విషయాన్ని తేర పైకి తీసుకు రాలేదని, తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నానని, సినిమాలో రచయితగా తన పేరు పడితే చాలని, ఈ “కత్తి” కధ నాదేనన్న క్రెడిట్ కావాలని, బహుశా మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందేమోనన్న భావనను రచయిత వ్యక్తపరిచారు.

సినీ పరిశ్రమలో ఇలాంటి వివాదాలు సర్వ సాధారణమే కావడంతో తొలుత అంత తేలికగా తీసుకున్నారు. అయితే “కత్తి” కధ నరసింహారావుదేనని కమిటీ తేల్చడంతో, ఇవి కేవలం పబ్లిసిటీ కోసం చేసిన ఆరోపణలు కావని, దీని వెనుక సదరు రచయిత ఆవేదన ఎంతో ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ వివాదం త్వరగా పరిష్కారమై సినిమా సెట్స్ పైకి వెళ్ళాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.