chittor mayor katari anuradha diedసంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసు క్లైమాక్స్‌కి చేరింది. లైఫ్‌లో తనను ఎదగనివ్వలేదనే కారణంతోనే అనురాధను, ఆమె భర్త మోహన్‌ని తాను చంపినట్టు నిందితుడు చింటూ అంగీకరించాడు. తన పెళ్లికి అడ్డుపడుతున్నారనే కోపం కూడా ఈ హత్యకు కారణమైంది. తనను క్రిమినల్‌గా చూపించి, తనకు పెళ్లి కాకుండా చేశారని అందుకే వాళ్లని హతమార్చానని అంటున్నాడు చింటూ!

మెరైన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ముంబైలో ఉద్యోగం చేస్తున్నానని, తన మేనమామ మోహన్‌కు అండగా ఉండేందుకు జాబ్ వదిలేసి రావాల్సి వచ్చిందని వెల్లడించాడు. మేయర్ దంపతుల హత్యకు ఆరు నెలల ముందుగానే ప్లాన్ చేశాడని, చింటూ అనుచరులు కార్పొరేషన్ కార్యాలయంలో రహస్యంగా వీడియోలను చిత్రీకరించి, వాటి ఆధారంగా హత్యకు స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో రెండుసార్లు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని ఆ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు.

హత్య జరిగిన తర్వాత గంగాధర నెల్లూరు మీదుగా వెల్లూరు, కృష్ణగిరి వైపు బెంగుళూరు చేరుకున్నాడని ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్‌తో‌పాటు 20 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాన్నారు పోలీసులు. మరో 12 మందిని విచారిస్తున్నారు. ఇలా హత్యకు సంబంధించిన విశేషాలన్నీ పూస గుచ్చినట్లు వివరించారు.