Chintamaneni Prabhakar arrested దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ కాసేపటి క్రితం అరెస్టయ్యారు. దళితులను దూషించి.. దౌర్జన్యం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని గత పన్నెండు రోజులు గా అజ్ఞతంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పట్టువిడవకుండా ఆయన కోసం గాలిస్తుండడంతో ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు.

ఆయన లొంగిపోవడానికి సిద్ధ పడినా ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చి పోలీసులకు అడ్డుపడ్డారు. చింతమనేని నివాసంలో ఆరుగురు కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు.

రెండు వారాలుగా 12 పోలీసు బృందాలను చింతమనేనిని పట్టుకోవడానికి ప్రభుత్వం వినియోగించింది. అయితే చివరికి చింతమనేని స్వయంగా లొంగిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ ప్రోద్బలంతో పెట్టిన కేసులేనని, తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చింతమనేని చెప్పారు. తాను తప్పు చేసినట్టు మంత్రి బొత్సా రుజువు చేస్తే.. తన తండ్రి ఆస్తి, తన ఆస్తి పేదలకు దానం చేస్తానని, లేకపోతే మంత్రి పదవికి బొత్సా రాజీనామా చేస్తారా? అంటూ చింతమనేని సవాల్ విసిరారు.