chintalapudi-venkataramaiah-quits-janasena-partyఎన్నికల ఓటమి నుండి తేరుకోకముందే జనసేన పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది. పార్టీ మీద నమ్మకం లేకపోవడంతో ఇంకో కారణం చేతనో ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల తరువాత రావెల కిషోర్ బాబు, మారిశెట్టి రాఘవయ్య, చింతల పార్ధసారధి, అద్దేపల్లి శ్రీధర్ వంటి నేతలు పార్టీ నుండి బయటకు వెళ్లారు.

నిన్న మరో సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా సమర్పించారు. తాజగా మరో సీనియర్ నేత చింతలపూడి వెంకట్రామయ్య జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన 2009 లో ప్రజారాజ్యం తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 2019ఎన్నికలలో ఆయన గాజువాక నుంచి కాకుండా పెందుర్తి నుంచి జనసేన తరపున పోటీచేసి ఓడిపోయారు.

గాజువాకలో వపన్ కళ్యాణ్ పోటీచేసిన సంగతి తెలిసిందే. దానితో ఆయనకు ఆ సీటు ఆశించినా దక్కలేదు. కాగా గాజువాక ప్రజలతో తాను మమేకం అయి ఉన్నానని, వారి సూచన మేరకు తాను పార్టీని వీడుతున్నానని ఆయన చెప్పారు. అయితే పార్టీ మీద ఎటువంటి విమర్శలు చెయ్యకుండా పవన్ కళ్యాణ్ కుటుంబం పట్ల తమకు అభిమానం ఉందని ఆయన అన్నారు.

ఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేనకు ఒకటే సీటు వచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం తెలిసిందే. ఎన్నికల తరువాత కూడా పార్టీ గానీ పవన్ కళ్యాణ్ గానీ పెద్దగా యాక్టీవ్ గా ఉన్నట్టుగా లేరు. దానితో నాయకుల నమ్మకం మరింత సడలినట్టుగా ఉంది.