Chintakayala Ayyanna Patruduఅమరావతి రైతుల మహా పాదయాత్రపై మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు తదితరులు విషం కక్కుతుండటంపై మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చాలా ఘాటుగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు మేము కూడా ఇక్కడే రాజధాని కడతాం అని అసెంబ్లీలోనే మీరు చెప్పారా లేదా?మా బాస్ ఇక్కడే అమరావతిలోనే ఉండాలనే ఉద్దేశ్యంతో ప్యాలస్ కట్టుకొంటున్నారు అని రోజా చెప్పారా లేదా?అధికారంలోకి రాక మునుపు అమరావతి రాజధాని అని చెప్పి, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంతావేమిటి జగన్ రెడ్డి? మళ్ళీ మాటేందుకు మార్చవు… మడమ ఎందుకు తిప్పావు?

మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిర్మిస్తున్న అమరావతిని నిలిపివేయడమే కాకుండా, ‘ఇక్కడేముంది ఇదో ఎడారి,” అంటాడు మీ మంత్రి బొత్స సత్యనారాయణ. మరో పనికిమాలిన మంత్రి ‘ఇదో శ్మశానం’ అని అంటాడు. మరి ఎలక్షన్స్ ముందు ఆ మాట ఎందుకు చెప్పలేదు?నువ్వు (సిఎం జగన్మోహన్ రెడ్డి) తీసుకొంటున్న తుగ్లక్ నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నష్టపోతోందని నీకు తెలుసా?రాజధాని లేదని చెప్పి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదు.

హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేస్తానని చెప్పి, మళ్ళీ మూడు రాజధానులు అంతావేమిటి జగన్ రెడ్డి? పైగా మీ మంత్రి ఎవరో మూడు రాజధానుల కోసం మళ్ళీ అసెంబ్లీలో చట్టం చేస్తామని చెపుతున్నాడు. అసలు మీకు చట్టాలంటే తెలుసా? వాటి గురించి ఏమైనా అవగాహన ఉందా?దమ్ముంటే మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని హైకోర్టుకి ధైర్యంగా చెప్పగలవా? వెళ్ళి ప్రజలను ఓట్లు అడగగలవా జగన్ రెడ్డీ?” అంటూ అయ్యన పాత్రుడు గట్టిగా కడిగిపడేశారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ గురించి ఆలోచన కానీ, ప్రజల ఆకాంక్షల గురించి కానీ పట్టని వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకే మొగ్గు చూపుతోందని మంత్రుల మాటలతో స్పష్టమైపోయింది. కనుక ప్రజలకు అమరావతి కావాలో మూడు రాజధానులు కావాలో వచ్చే ఎన్నికలలో తేల్చుకోకతప్పదు.