Chinta mohan invites pawan kalya and ys jagan into congress‘నాయకుడు’ లేక వెలవెలబోతున్న ఏపీ కాంగ్రెస్ ను ఆదుకునేదెవరు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్న రఘువీరారెడ్డి ప్రజాకర్షక నేత కాదు. ఇక, పార్టీలో ఉన్నా అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్న చరిష్మా గల మెగాస్టార్ చిరంజీవి వైఖరి కాంగ్రెస్ వర్గాలకు అంతు పట్టడం లేదు. దీంతో కొత్త నాయకత్వం కోసం 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ నిరీక్షణ సాగిస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికార పార్టీకి అండగా ఉన్నటువంటి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్ వ్యాఖ్యానించారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన చింతా మోహన్… ఏపీలో పటిష్టమైన నాయకత్వం అవసరమని, అందుకే పవన్, జగన్ లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు చింతా మోహన్ తన వ్యక్తిగతంగా చేసిన అభిప్రాయమా, లేక అధిష్టానం తన మాటగా చింతా చేత పలికించిందా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో ఒకవేళ విలీనం వంటివి జరిగినా, పెద్దగా సంచలనాలకు దారి తీసే అవకాశం లేదు. అయితే తన రాజకీయ జీవితమే కాంగ్రెస్ వ్యతిరేకిగా ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇటీవల తన అన్నయ్యను పక్కన ఉంచుకుని కూడా, అన్నయ్య దారి, తన దారి వేరని స్పష్టమైన ప్రకటన చేయడంతో పవన్ విషయంలో కాంగ్రెస్ ‘పప్పులు’ చెల్లకపోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.