Chinnari Movie Teaser ఇటీవల కాలంలో ‘హార్రర్’ సినిమాలు కాస్త ‘కామెడీ’ సినిమాలుగా మారిపోయాయి. భయపెడతారని ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ నవ్విస్తున్నారు నటీనటులు. దీంతో సరైన హార్రర్ సినిమా పడితే, ప్రేక్షకులు పండగ చేసుకోవడం ఖాయం అనేటంతగా భయంకరమైన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఓ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కన్నడంలో “మమ్మీ” పేరుతో రూపుదిద్దుకుంటున్న సినిమాను తెలుగులో “చిన్నారి” పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను ప్రముఖ దర్శకుడు మారుతీ విడుదల చేసారు. రెగ్యులర్ గా వచ్చే హార్రర్ సినిమాలతో పోలిస్తే ఈ టీజర్ కాస్త మెరుగనిపించే విధంగా ఉందని చెప్పవచ్చు. చిన్న పిల్లతో కూడుకున్న సబ్జెక్ట్ కావడంతో, ప్రేక్షకులకు ఫ్రెష్ నెస్ ను పంచడంలో సక్సెస్ సాధించింది ఈ టీజర్.

దీనికి తోడు ఒక్క ప్రియాంక మినహా నటీనటులు అంతా కొత్తవారు కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అవుతుంది. టీజర్ కు అందించిన అజినీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, కట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. గోవా నేపధ్యంలో సాగే ఈ కధ నిజ జీవితపు ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించారు. నవంబర్ లో ఈ “చిన్నారి” హార్రర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది చిత్ర యూనిట్.