Chinna Jeeyar to Mediate Between YS Jagan and BJP తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టే దైవ కార్యాలలో ప్రముఖ చినజీయర్ స్వామి సలహాలు, సంప్రదింపులు ఉంటాయన్న విషయం బహిరంగమే. అయితే ఇప్పుడు అదే చినజీయర్ స్వామికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర కావడం పొలిటికల్ వర్గాలలో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఇటీవల ఓ వివాహ వేడుకలో చినజీయర్ స్వామిని కలిసిన జగన్, కాసేపు చర్చలు జరుపగా… శంషాబాద్ లో ఉన్న తన ఆశ్రమానికి విచ్చేయాల్సిందిగా జగన్ ను స్వామి ఆహ్వానించారు.

మంగళవారం నాడు దీనికి ముహూర్తం ఖరారై, చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేసిన జగన్ కాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. బయటకు మాత్రం… తిరుమల పాదయాత్రకు జగన్ వెళ్లనున్నారు గనుక, స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు మాత్రమే జగన్ వచ్చారని వైసీపీ వర్గాలు చెప్తున్నప్పటికీ, దీని వెనుక ఓ వ్యూహం దాగి ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. హిందువులను దూరం పెడుతున్నారని గతంలో తనపై ఏర్పడిన మచ్చను చెరిపి వేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి.

అయితే ఉన్నట్లుండి జగన్ కు చినజీయర్ దగ్గర ఎలా దగ్గరయ్యారు? అనేది ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో… తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు తెరపైకి వచ్చింది. జగన్ కు – కేసీఆర్ కు సత్సంబంధాలు ఉన్న దరిమిలా, కేసీఆర్ ఇచ్చిన సలహా మేరకే జగన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారనేది ఓ టాక్. అటు చినజీయర్ కు కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో, ఈ జగన్ – చినజీయర్ ఎపిసోడ్ మొత్తంలో తెలంగాణా ముఖ్యమంత్రివర్యుల గారి పేరు హైలైట్ గా వినపడుతోంది. రాజకీయం అంటే ఇదేగా..!