Chandrababu - Naidu Vs Chief secretaryఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ ఎజెండా రూపొందించాలని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. ఈ ప్రకారం ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఐతే కేబినెట్ భేటీకి ఎజెండా రూపొందించడానికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సుగుమంగా లేనట్టు తెలుస్తుంది. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్‌, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్‌లో భేటీ అయ్యారు.

వారికి రాష్ట్రంలో కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీ కుదరదు అని చెప్పినట్టు సమాచారం. ఇదే విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోనూ ఆయన భేటీ అయి సమాలోచనలు జరిపారు. కోడ్ అమలులో ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేబినెట్ మీటింగు పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోవడాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు అంటే పొసగని చీఫ్ సెక్రటరీ ఎలా స్పందిస్తారో చూడాలి.

కేబినెట్‌ భేటీ ఎజెండాకే పరిమితమవుతుందా? లేదా బిజినెస్‌ రూల్స్‌పై కూడా చర్చించి ఎల్వీ సుబ్రహ్మణ్యం పై యాక్షన్ తీసుకుంటారా ? అని ఉత్కంఠ నెలకొంది. కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ప్రకారమే వ్యవహరించాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సమీక్షా సమావేశాలకు అటు సీఈవో.. ఇటు సీఎస్ ఇద్దరూ అంగీకరించకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుందా..? లేదో వేచి చూడాల్సిందే మరి.