Chief Secretary -LV Subrahmanyam - Chandrababu- Naidu warఎన్నికల పోలింగ్‌ అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం ఆపినా చంద్రబాబు ఈ సమీక్ష చెయ్యడం విశేషం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పోలవరంపై 90 సమీక్షలు జరిపారు, అలాగే 30 సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

మరోవైపు ఈ నెల 10న కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్పందనపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు కోడ్ అమలులో ఉన్న సమయంలో సాధారణంగా మంత్రవర్గ సమావేశం జరుగదు. కానీ ప్రధాని మోదీ తన మంత్రివర్గ సమావేశాన్ని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే నిర్వహించారు. అదే దారిలో చంద్రబాబు కూడా కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఫణి తుఫాను బాధితులకు సాయం, సహాయ చర్యలపై సమీక్ష, అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, సాగునీటి సరఫరా వివిధ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. నాలుగు జిల్లాల్లో కోడ్ సడలించిన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశానికి ఆటంకాలేవీ ఉండే అవకాశం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమావేశం నిర్వహణ అజెండాను సీఎస్ ఆమోదించి మంత్రివర్గ సమావేశానికి పంపాల్సి ఉంటుంది. ఇప్పటి దాకా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవని చీఫ్ సెక్రటరీ ఇప్పుడేం చెయ్యబోతున్నారు అనేది చూడాలి.