jayalalithaa-health-updatesతీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారమూ రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జయలలిత ఆరోగ్యంపై వైద్యుల హెల్త్ బులెటిన్ విడుదలై నేటికి వారం రోజులైంది. ఆమె కోలుకుంటున్నారన్న ఒక్క మాట తప్ప మరో మాట ఎక్కడా వినిపించకుండా చూసేందుకు సైబర్ నిపుణులతో కూడిన పోలీస్ టీమ్, అన్ని సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతోంది.

జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాపింపజేశారన్న ఆరోపణలపై గత మూడు వారాల్లో 50కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కూడా. కాగా, సెప్టెంబర్ 22న జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరిన కారణంగా ఆమెకు వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నామని, ఆమె కోలుకుంటున్నారని గతవారంలో ఓ హెల్త్ బులెటిన్ విడుదలైన తరువాత అపోలో వైద్యుల నుంచి మరో మాట రాలేదు.

ఇక జయలలితను పరామర్శించడానికి వచ్చిన ఎంతో మంది ప్రముఖులు సైతం, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు ఆందోళన చెందుతూ, అమ్మ త్వరగా కోలుకోవాలని, తమకు కనిపించాలని పూజలు చేస్తున్నారు.