MP Kanumuru Raghu-Rama Krishnam Raju

ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకు ఎంపీ పై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయించి, ఆ తరువాత థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ జగన్ మోహన్ రెడ్డి పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఉదంతంగా క్షత్రియ సామాజికవర్గం (రాజులు) కినుక వహిస్తుందేమో అని ఆ సామాజికవర్గ వారితోనే రఘురామను తిట్టించడం గమనార్హం.

అరెస్టు జరిగిన వెంటనే ఆ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మీడియా ముందుకు వచ్చి ఢిల్లీలో 14 నెలలు కూర్చుని తనను గెలిపించిన ప్రజల్ని రఘురామరాజు గాలికొదిలేశారని, వారి బాగోగులు పట్టించుకోలేదన్నారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని రంగనాథరాజు అన్నారు.

ప్రజల మనోభావాలు అవసరం లేని రఘురామరాజుకు గుణపాఠం అవసరమన్నారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అదే సామాజిక వర్గ ఎమ్మెల్యే ప్రసాద రాజు తో కూడా ఎంపీని తిట్టించారు. అంతటితో ఆగకుండా భీమవరంలో క్షత్రియ సమాఖ్య లోని వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల నేతలతో ఒక మీటింగ్ పెట్టించి వివాదంతో తమకు సంబంధం లేదని చెప్పించారు.

ఈ భేటీలో భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లి గూడెం క్షత్రియ నాయకులు పాల్గొన్నారని…. వారంతా క్షత్రియులపై గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో‌ 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చినందున తాము ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని కూడా స్టేట్మెంట్ ఇప్పించారు.