chennai-vardah-cycloneగతేడాది డిసెంబర్ లో చెన్నైను వణికించిన తుఫాన్ మళ్ళీ అదే డిసెంబర్ లో చెన్నైను పలకరించింది. ఓ పక్కన ‘అమ్మ’ జయలలిత మరణించి పుట్టెడు దు:ఖంలో ఉన్న చెన్నై వాసులకు తాజాగా “వార్ధా” తుఫాన్ బీభత్సాన్ని చూపిస్తోంది. భవనాలే ఊగిపోయే విధంగా చెన్నైలో ఈదురు గాలులు వీస్తుండడంతో మనుషులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో సఫలమైంది.

ఈదురు గాలుల ధాటికి వందల ఏళ్ళ నాటి చెట్లు తృణప్రాయంగా నేలకూలుతుండగా, రోడ్లపై ఉన్న కార్లు గాల్లోనే గింగరాలు తిరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి పార్కింగ్ లో ఉన్న ఓ కారు గాలిలోనే తిరగబడడం విశేషం. అప్పటికే ఓ కారు తిరగబడి ఉండగా, తాజాగా బోర్లా పడిన కారు దాని పక్కన పడింది. ఇలాంటి సన్నివేశాలు సహజంగా హాలీవుడ్ సినిమాలలో మాత్రమే చూస్తుంటాం.

కానీ, ప్రకృతి సృష్టించే బీభత్సాన్ని అడ్డుకోవడం ఎవరి సాధ్యమూ కాదనే విధంగా చెన్నైను మరోసారి హడలెత్తిస్తోంది వార్ధా తుఫాన్. దీంతో డిసెంబర్ మాసం అంటేనే తమిళనాడు వాసులు గుండెలు చేతిలో పట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత డిసెంబర్ పెను విషాదాన్ని మిగల్చగా, ఈ ఏడాది డిసెంబర్ కూడా జయలలిత మరణాన్ని, వార్ధా తుఫాన్ ను గుర్తుంచుకునేలా చేస్తోంది.