Chennai To America Jallikattu Protestజల్లికట్టు ఉద్య‌మం నేప‌థ్యంలో తమిళనాడులోని చెన్న‌య్‌, మధురై లతో పాటు ప‌లు చోట్ల ఆందోళ‌న‌కారులు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోయంబ‌త్తూరులో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర‌ మంత్రి వేలుమణి, పోలీసు కమిషనర్‌తో కలిసి అక్క‌డ‌కు చేరుకోగా ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. చ‌ర్చ‌ల‌కు వ‌చ్చిన‌ వారిని చూసిన ఆందోళ‌నకారులు తీవ్రంగా మండిపడుతూ… వేలుమణి, పోలీసు కమిషనర్‌ వాహనాలపై రాళ్లతో, కర్రలతో దాడికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర‌ ఉద్రిక్తత నెలకొంది.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జ‌రిగింది. అలాగే పోలీసులు చెదరగొట్టి మెరీనా బీచ్ ని ఖాళీ చేయించగా, ఆందోళనకారులు ఐస్‌ హౌస్‌ పోలీస్‌ స్టేషన్ ముందు ఉన్న కారు, ఆటో సహా 25 వాహనాలకు నిప్పుపెట్టడంతో సుమారు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్ ను అధికారులు రంగంలోకి దించి, ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్ర‌యోగం చేశారు. ఆందోళ‌న‌ల‌తో చెన్నయ్ నగరంలో పెద్ద ఎత్తున‌ ట్రాఫిక్‌ జాం ఏర్ప‌డింది.

తమిళనాడులో పరిస్థితి ఇలా ఉంటే, జల్లికట్టు క్రీడకు మద్దతుగా తాజాగా అమెరికాలో కూడా వంద‌ల సంఖ్యలో తమిళులు ఆందోళనకు దిగారు. అమెరికాలో ఉంటున్న త‌మిళులు వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. మ‌రోవైపు వర్జీనియాలోని నార్ఫోక్‌లో పెటా హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట కూడా తమిళులు నిరస‌న తెలిపారు. పెటాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్ర‌ద‌ర్శించారు. తాము కూడా జంతు ప్రేమికుల‌మేన‌ని, వాటితో ఎలా మెలగాలో తమకు తెలుసని, జ‌ల్లిక‌ట్టు క్రీడ తమ సంస్కృతిలో భాగమని వ్యాఖ్యానించారు.