Chandrayaan 2: Vikram Lander Location Foundభారత్ తలపెట్టిన చంద్రయాన్ 2 మిషన్ చివరి నిమిషంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. విక్రమ్ లాండర్ చంద్రుడి భూభాగనికి దగ్గరలోకి వచ్చాకా క్రాష్ లాండింగ్ జరిగింది. విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధ్రువంపై దిగుతూ కేవలం 750 మీటర్ల దూరంలో దానితో సంబంధాలు తెగిపోయాయి. దాని ఆచూకీ తెలుసుకోడానికి ఇస్రో తీవ్రంగా ప్రయత్నించింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది.

విక్రమ్ జాడ కోసం గత రెండు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. కూలిపోయిన ప్రదేశం తాలూకు ఫోటోలు విడుదల చేశారు. మన దేశానికే చెందిన షణ్ముగ సుబ్రహ్మణియన్‌ అనే వ్యక్తి విక్రమ్‌కు సంబంధించిన తొలి శకలాన్ని గుర్తించినట్టు నాసా పేర్కొంది. విక్రమ్‌ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాన్ని శాస్త్రవేత్త షణ్ముగం గుర్తించారని, అనంతరం ఎల్ఆర్‌వో ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను గుర్తించిందని నాసా తెలిపింది.

చంద్రుడి దక్షిణ ధ్రువం మీదుగా అక్టోబర్ 14, 15, నవంబర్‌ 11న ఎల్ఆర్‌వో ప్రయాణించినప్పుడు తీసిన ఫోటోలు వీటిని ధ్రువీకరించినట్లు ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్లే ల్యాండింగ్‌లో లోపం తలెత్తిందని గుర్తించారు. ఈ శకలాలు గుర్తించడంతో మిషన్ లో ఎక్కడ తప్పు జరిగింది అనేది మరింత లోతుగా విశ్లేషించే అవకాశం ఉంటుంది.

సాఫ్ట్ లాండింగ్ జరిగి ఉంటే ప్రపంచంలో చంద్రుడిని చేరిన నాలుగో దేశంగా భారత్ కీర్తి గడించేది. అయితే ఇప్పటికే ఈ ఘనత సాధించిన ఏ దేశం కూడా రెండు ప్రయత్నాలు ఫెయిల్ కాకుండా చంద్రుడిని చేరలేదు. విక్రమ్ లాండర్ ఫెయిలైనా ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరిగి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. దాదాపుగా మూడు సంవత్సరాలు గా అది పని చేస్తోంది.