Chandrayaan 2 launched successfullyభారత అంతరిక్ష చరిత్రలో ఒక అపూర్వఘట్టం చోటు చేసుకుంది. చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. 2008 నుంచి చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్‌–2 మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే వారం రోజులు తిరగకముందే మళ్లీ ప్రయోగానికి సిద్ధమైన శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించారు.

20గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌ 2 ఉపగ్రహంతో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌) 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం భూమికి దగ్గరగా 170కి.మీలు.. భూమికి దూరం 39059కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌ 2ను విడిచిపెట్టింది.5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్‌ 2 ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది.

భూ కక్ష్యలోకి చంద్రయాన్‌ మాడ్యూల్‌ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన ఆధీనంలోకి తీసుకోనుంది. దాదాపుగా ఏడాది పాటు అంతరిక్షంలో అనేక ప్రయోగాలు చేస్తుంది. గతంలో చంద్రయాన్ 1 సందర్భంగా జాబిల్లిలోని నీటి జాడపై మరింత లోతైన విశ్లేషణ జరుపుతుంది.