Chandrayaan 2చంద్రయాన్‌-2లోని ల్యాండర్‌ విక్రమ్ నుంచి సంకేతాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ను దాదాపు కోల్పోయినట్లేనని తెలుస్తుంది. ‘‘ప్రస్తుతానికి ల్యాండర్‌తో ఎటువంటి సంబంధాలు లేవు. అంటే దాదాపు కోల్పోయినట్లే. ఎలాంటి ఆశలు లేవు. తిరిగి దానితో సంబంధాలను పునరుద్ధరించడం చాలా కష్టం’’ అని ఇస్రోకు సంబంధించిన ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ల్యాండర్ విక్రమ్‌ ఒక లూనార్‌ రోజు (భూమిపై 14రోజులు) పనిచేసేలా రూపొందించారు. దానిలో ప్రజ్ఞాన్‌ అనే రోవర్‌ని అమర్చారు.

ఈ రోబోటిక్‌ రోవర్‌ 500మీ ప్రయాణించి జాబిల్లి ఉపరితలంపై పలు పరీక్షలు జరిపేలా తీర్చిదిద్దారు. కానీ, చంద్రుడికి 2.1కి.మీ దూరానికి విజయవంతంగా చేరిన ల్యాండర్‌ నుంచి అర్ధాంతరంగా సంకేతాలు నిలిచిపోయాయి. ల్యాండర్‌ తిరిగి పని చెయ్యడం.. భవిష్యత్తులో దాన్నుంచి సంకేతాలు ఇచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే అంటున్నారు. అయితే విక్రమ్ ల్యాండర్ పని చెయ్యకపోయినా .. కేవలం 5శాతం ప్రయోగం మాత్రమే విఫలమైనట్టు అంటున్నారు.

ఇప్పటికే జాబిల్లి చుట్టూ విజయవంతంగా చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్‌ తన పని తాను చేస్తుంది. తద్వారా 95శాతం ప్రయోగం విజయవంతం అయినట్లేనన్నారు. రానున్న ఏడాది కాలం ఆర్బిటర్‌ నుంచి చంద్రుడి చిత్రాలు, ఇతర సమాచారం అందునుందన్నారు. చంద్రయాన్ 2 ప్రాజెక్టు కోసం ఇస్రో 978 కోట్లు ఖర్చు పెట్టింది. అసలు విక్రమ్ ల్యాండర్ విఫలం కావడానికి గల కారణాలు ఏంటని తెలుసుకోవడంలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. గతంలో రష్యా, అమెరికా చంద్రుడి మీదకు పరికరాన్ని పంపడానికి 11 సార్లు, 4 సార్లు ఫెయిల్ అయ్యారు.