Chandramohan reveals about S V Ranga Rao sonsపండిత పుత్రః.. పరమ శుంఠ అని పెద్దలు చెప్పినట్టు… సినీ పరిశ్రమలోని కొందరు పుత్రులు, వారి తల్లిదండ్రులకు గుదిబండలా తయారై వారి పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన విషయాన్ని ప్రముఖ నటుడు చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటుడిగా పేరొందిన ఎస్వీఆర్, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచి వెలిగే నటుడని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పరువు ప్రతిష్ఠలకు ఆయన కుమారుడు మచ్చ తెచ్చాడని అన్నారు.

తండ్రి తాగి వదిలేసిన గ్లాసులో చుక్కలు తాగడానికి 12 ఏళ్ల వయసులోనే అలవాటు పడ్డాడని, ఆ వ్యసనం పెరిగి గజతాగుబోతు అయ్యాడని చెప్పారు. కాస్త పెద్దయ్యాక తనకు కనిపించిన ప్రతి నటుడ్ని ‘అంకుల్ వందివ్వు, యాభై ఇవ్వు’ అంటూ అడుక్కుని తాగుతూ తండ్రి పేరు చెడగొట్టడంతో పాటు, ఆయన ఆస్తులను కూడా తగలేశాడని వివరణ ఇచ్చారు. తెలుగు సినిమాల్లో తిరుగులేని విలన్ గా పేరు తెచ్చుకున్న నటుడు రాజనాల, హరనాథ్, ప్రముఖ హస్యనటుడు రేలంగి పిల్లలంతా కూడా ఇలాంటి వారేనని అన్నారు.

ఇక సినిమాల్లో నాగయ్య సంపాదనకు అంతేలేదని, అయితే పిల్లల అలవాట్లతో ఆస్తులు పోగొట్టుకుని, వార్ధక్యంలో 250 రూపాయలకు పనిచేసే స్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి అలవాట్లకు తల్లిదండ్రులు కూడా ఒక కారణమని అభిప్రాయపడ్డారు. పిల్లల అలవాట్లు ఒక ఎత్తైతే మరికొందరు సినిమాల్లో బాగా రాణిస్తున్న సమయంలో సినిమాలు తీసి మరికొందరు పతనమైపోయారని చెప్పారు. మహా గాయకుడు ఘంటసాల కూడా అలాగే పతనమయ్యారని అన్నారు.

ఘంటసాల ‘సొంతవూరు’ సినిమా తీసి సర్వనాశనం అయిపోయారని, ఈ సినిమాలో పని చేసిన నటీనటులంతా ఫ్రీగా పని చేసినా, ఆ సినిమా లాభాలార్జించలేదని, దీంతో తాకట్టుపెట్టిన ఆస్తులన్నీ పోగొట్టుకున్నారని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గ్యారెంటీ లేని ప్రొఫెషన్ అని, అయితే తెలివి అంటే సంపాదించడం మాత్రమే కాదని అన్నారు. పక్కవాడ్ని చూసి నేర్చుకోవడం కూడా తెలివేనని చెప్పిన చంద్రమోహన్, తాను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టానని, తాను కనీసం ఎవరికీ దానం కూడా చేయనని తెలిపారు.