YS-Jagan-not going back on polavaram project reverse tenderingపీపీఏల రివ్యూలకు, పోలవరం రివర్స్ టెండర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ, అమిత్ షాల అనుమతి, దీవెనలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. తప్పులు చేసి బీజేపీపై నెట్టాలని సీఎం జగన్‌ ఎందుకు అనుకుంటున్నారని పురంధేశ్వరి ప్రశ్నించారు. పీపీఏల రద్దు, పోలవరం రివర్స్‌ టెండర్లు జగన్‌ స్వయంకృతాపరాదమని అన్నారు.

అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని చెబుతూనే ఉన్నామన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా… జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. వారు చేసిన తప్పును ధైర్యంగా చెప్పుకోలేక కేంద్రంపై నెట్టడం సరికాదన్నారు.

రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం సూచనలను జగన్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన తప్పులే జగన్ చేస్తే.. శిక్ష కూడా అదే ఉంటుందా? గతంలో చంద్రబాబు తాను చేసిన తప్పులకు కేంద్రాన్ని నిందిస్తున్నారు అనే అభియోగంతో టీడీపీని గద్దె దించడానికి బీజేపీ అన్ని విధాలుగానూ ప్రయత్నం చేసింది. ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని గెలుపుకు పరోక్షంగా సహకరించింది. అంటే ఇప్పుడు అదే తప్పు చేస్తున్న జగన్ ను కూడా బీజేపీ రాజకీయంగా ఇబ్బంది పెడుతుందా?