Chandrababu Shoulders Death Bed of Harikrishna in Final Journeyనందమూరి హరికృష్ణ అంతిమయాత్ర మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో మొదలయ్యింది. స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విషణ్ణ వదనంతో స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడె పట్టుకున్నారు.

జాస్తి చలమేశ్వర్ హరికృష్ణ ప్రాణమిత్రుడు. ఎటువంటి సలహా కావాలన్నా హరికృష్ణ సంప్రదించేవారిలో ఆయన మొదటి వారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. ‘హరికృష్ణ అమర్ రహే’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అక్కడి నుంచి వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు.

దాదాపు పది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. అదే విధంగా మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.