chandrababu phone call what was in thatపార్టీ కార్యకర్త తోట చంద్రయ్య ఉదంతాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎంత సీరియస్ గా తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రయ్య పార్థీవ దేహాన్ని స్వయంగా చంద్రబాబు మోసి, ఈ హత్యా రాజకీయాలను ఖండించిన విషయం తెలిసిందే.

తాజాగా దీనికి సంబంధించి చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడిన ఓ ఆడియో టేప్ ను సాక్షి మీడియా ప్రసారం చేస్తోంది. హత్య జరిగిన తర్వాత పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయడం ఈ ఆడియో టేప్ లలో ఉంది. చంద్రయ్య హత్యను చాలా సీరియస్ గా పరిగణించాలని చంద్రబాబు మాటల్లో స్పష్టమైంది.

కానీ జగన్ మీడియా మాత్రం ‘శవ రాజకీయాలు’ పేరుతో చంద్రబాబును టార్గెట్ చేస్తూ యధావిధిగా కధనాలు ప్రసారం చేస్తోంది. సొంత పార్టీ కార్యకర్తను హత్య చేస్తే చంద్రబాబు సీరియస్ గా తీసుకోవడం జగన్ మీడియాకు తప్పుగా మారిందా? బహుశా పార్టీ కార్యకర్తలను ఎవరు ఎలా చంపేసినా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా చంద్రబాబు సైలెంట్ గా ఉండాలని సాక్షి అండ్ కో భావిస్తుందా?

జగన్ మీడియా ప్రసారం చేస్తోన్న ఈ కధనాలపై తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. మరి నాడు వైఎస్సార్ చనిపోయిన సమయంలో ”ఓదార్పు యాత్ర” పేరుతో జగన్ మోహన్ రెడ్డి చేసింది “శవ రాజకీయాలు” కాదా? నాడు ఎవరు ఎలా చనిపోయినా వైఎస్సార్ మరణం తట్టుకోలేకే చనిపోయాడని చెప్పడాన్ని ఏమంటారు? అంటూ వేస్తోన్న ప్రశ్నలు కోకొల్లలు.

ఇదిలా ఉంటే అసలు ఈ ఆడియో టేప్ లు బయటకు ఎలా వచ్చాయి? అనేది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను దక్కించుకుంది. గతంలో ఫోన్ లను ట్యాప్ చేస్తోందని కేసీఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు పలు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆడియో లీకేజ్ తెలుగుదేశం పార్టీ సభ్యుల నుండే వచ్చిందా? లేక ఫోన్ ట్యాపింగ్ వలన జరిగిందా? అన్నది అత్యంత ప్రాధాన్యతను దక్కించుకుంది.