Chandrababu naidu AP assemblyఅసంబద్ధమైన రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అసెంబ్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిఎం… “ఎవరితోనూ సంప్రదించకుండా విభజన చేశారని, విభజన శాస్త్రీయంగా జరగలేదని” విమర్శించారు. విభజనలో ఇచ్చిన హామీల ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్యను 225కు పెంచాలని, పోలవరం ప్రాజెక్ట్ కు తగినన్ని నిధులు ఇవ్వాలని కోరారు.

స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని, సవరించకపోతే తెలంగాణలో చదువుకున్నవారు ఏపీలో నాన్‌లోకల్‌ అవుతారన్నారు. దీనిపై రాష్ట్రపతి త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి వెలుపల ఉన్న ఆస్తుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. అలాగే, ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని, పన్నుల రాబడిలో వ్యత్యాసాలను సరిచేయాలన్న చంద్రబాబు, కేంద్రం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపకపోతే ప్రాజెక్ట్‌ కల సాకారమయ్యేది కాదని బాబు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ప్రధాని చొరవ తీసుకున్నారన్నారు. 2018నాటికి పోలవరం ఫేజ్‌-1 పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 2015-16లో పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు చేసిన 2,485 కోట్ల నిధులను తిరిగి ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం మొత్తం 4,092 కోట్లు ఖర్చుచేశామని… ఈ సొమ్మును కేంద్రం ఇవ్వాలని చెప్పారు.

కడపలో ఉక్కుకర్మాగారం, దుగరాజపట్నంలో ఓడరేవు, కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. పరిశ్రమలు, సేవల రంగంలోనూ ఏపీ వెనుకబడిందన్నారు.ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఏపీ ఆర్థిక లోటును భర్తీ చేయకపోతే 2019లోనూ ఆర్థిక లోటులోనే ఉంటామన్నారు. విభజనలో అన్యాయం జరిగినందున ఏపీకి ఉదారంగా సాయం చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు వినతి చేశారు.