chandrababu not invited to  World Telugu Conference 2017  ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుండి మొదలు అయ్యాయి. దేశవిదేశాలకు చెందిన తెలుగు ప్రముఖులెందరో హాజరవుతున్నారు. కవులు, రచయితలతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తెలుగు మహాసభలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రపంచంలోని తెలుగు వారందరిని ఏకం చెయ్యాల్సిన ఈ సభలు కొత్త వివాదాలు సృష్టిస్తున్నాయి.

తెలుగువారందరూ జరుపుకునే తెలుగు పండుగకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాత్రం ఆహ్వానం లేదు. దీనికి అనేక రకాల వంకలు చెబుతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలుగు మహాసభలో తెలుగు సంస్కృతి, భాష పరిరక్షణకు ఉద్దేశించి కాబట్టి పక్క రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులను పిలవాల్సిన అవసరం లేదన్న వారి వాదన.

చంద్రబాబు తెలుగు మహాసభలు జరిగే సమయంలో బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు కాబట్టే ఆహ్వానించలేదన్న వాదనను సైతం తెలంగాణ ప్రభుత్వ పెద్దలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు వాదనలలోను పస లేదు అనేది తెలుస్తూనే ఉంది. పేరుకి తెలుగు మహాసభలైన వీటిమీద తెలంగాణ మార్కు, కేసిఆర్ మార్కు ఉండాలని వారు తాపత్రయపడ్తున్నారట.

దీనిని పలువురు తెలుగు దేశం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇంతోటి దానికి తెలంగాణ మహాసభలు అని పెడితే పోయేది కదా, తెలుగు మహాసభలు అని పెట్టి సభల ముఖ్యోద్దేశానికి తూట్లు పొడవడం దేనికి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సభల వాళ్ళ తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎంతోకొంత మేలు జరిగితే మంచిదే.