Chandrababu_Naidu_YSRCP_Ward_Volunteersవైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని సృష్టించి వారికి నెలకి రూ.5,000 చొప్పున ప్రభుత్వం తరపున జీతాలు చెల్లిస్తూ పార్టీ సేవలకి వినియోగించుకొంటోంది. దీనిపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వాటిని సమర్ధంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుండటంతో ఎన్నికల సమయానికి వైసీపీ చేతిలో ఈ వాలంటీర్ వ్యవస్థ బలమైన ఆయుధంగా మారింది. దీనికితోడు ఇప్పుడు 5.5లక్షల గృహసారధులని కూడా ఏర్పాటు చేసుకొని సంక్షేమ పధకాలు పొందుతున్న లబ్దిదారులు చేజారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది.

నిజానికి గతంలో టిడిపి కూడా ఈవిధంగానే గ్రామ, పట్టణ స్థాయిలో జన్మభూమి కమిటీలని ఏర్పాటు చేసుకొంది. కానీ వారికి ప్రభుత్వం జీతాలు ఇచ్చేది కాదు. ఆ కారణంగా జన్మభూమి కమిటీల సభ్యులు అక్రమాలకి పాల్పడుతుండేవారని తరచూ ఆరోపణలు వస్తుండేవి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ దీనిని ఆయుధంగా మార్చుకొని జన్మభూమి కమిటీలు అవినీతికి పాల్పడుతున్నాయంటూ జోరుగా ప్రచారం చేయడంతో టిడిపికి రాజకీయంగా చాలా నష్టం కలిగింది.

బహుశః వైసీపీ ఆ జన్మభూమి కమిటీల వల్ల ప్రయోజనం, దానిలో ఉండే ఇబ్బందులని నిశితంగా గమనించే పకడ్బందీగా ఈ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని, వారి జీతాల భారం పార్టీపై పడకుండా ప్రభుత్వ పద్దులో రాసేస్తూ వారిని పార్టీ పనుల కోసం సమర్ధంగా వాడుకొంటోందని స్పష్టమయ్యింది.

పటిష్టమైన ఈ వాలంటీర్ వ్యవస్థని వైసీపీ ఎంత సమర్ధంగా వాడుకొంటోందో గమనించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కోసం ‘సాధిక సారధులు’ అనే ఓ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రతీ 50 ఇళ్ళకి ఓ వాలంటీర్, గృహసారధి చొప్పున నియమిస్తే, టిడిపిలో ప్రతీ 30 కుటుంబాలకి ఒకరు చొప్పున సాధిక సారధులని నియమించారు. సాధిక సారధులలో పురుషులతో మాట్లాడేందుకు పురుషులని, మహిళలతో మాట్లాడేందుకు మహిళలని నియమించబోతునట్లు తెలిపారు. వారు ప్రతీ ఇంటికీ వెళ్ళి టిడిపి, వైసీపీ ప్రభుత్వాల విధానాలు, పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పధకాలలో గల తేడాలని వివరించి టిడిపికి ఓట్లు వేయాల్సిందిగా కోరనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటమంటే ఆషామాషీ విషయం కాదు. ముందుగా వారిని వైసీపీ నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు, గృహసారధులు అడ్డుకొనే ప్రయత్నం చేయడం ఖాయం. వారు ఆ అవరోధాన్ని అధిగమించగలిగితే ప్రజలకి వివరించి ఒప్పించడం చాలా కష్టం. వైసీపీ ఒత్తిళ్ళని ఎదుర్కొంటూ పనిచేయాలంటే ఇంకా కష్టం. కనుక జీతాలు చెల్లించకపోతే ఎవరూ ఇంత రిస్క్ తీసుకోరు.

వాలంటీర్ల జీతాల భారం వైసీపీ పడటం లేదు కనుక దానికేమీ ఇబ్బంది లేదు కానీ వచ్చే ఎన్నికల వరకు లక్షల మందికి నెలనెలా టిడిపి జీతాలు చెల్లించాలంటే చాలా కష్టం. అయితే చంద్రబాబు నాయుడు ప్రతీ చిన్న విషయాన్ని చాలా దూరదృష్టితో ఆలోచించి చేస్తుంటారు కనుక ఈ ప్రయోగం విజయవంతం అవుతుందనే ఆశించవచ్చు.