A+ Rating to Amaravati Bondsగత ఎన్నికల ముందు తిరుపతిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ముందే నరేంద్ర మోడీ ఏపీకి హామీలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆ హామీలపై పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని, ఇటీవల మీటింగులు పెట్టి తనను విమర్శిస్తూ, కేంద్ర సర్కారుని మాత్రం ఒక్క మాట కూడా అనలేదని, ధర్మం, న్యాయాలతో ముందుకు పోవాలి కానీ ఇలా చేయకూడదని హితవు పలికారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో టీడీపీ ధర్మపోరాట సభ నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కేంద్ర సర్కారుపై పిడికిలి బిగించి పోరాడదామని… అంతిమ విజయం మనదేనని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో హైకోర్టు భవనాన్ని కూడా కట్టలేమని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని, అది ఆంధ్రుల హక్కని అన్నారు.

వాజ్‌పేయీ సంకల్పం నదుల అనుసంధానమని, పట్టిసీమ ద్వారా తాము అది చేశామని, ఇప్పటి కేంద్ర ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ, చేతలు లేవని మోడీ సర్కార్ ను తూర్పారబట్టారు. ఆనాడు తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, ఇప్పుడు అదే సంకల్పంతో అమరావతిని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టనని, అవినీతి పట్ల చండశాసనుడిలా ఉంటానని అన్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేయించి బాధితులకు న్యాయం చేస్తానని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాస్తులను స్వాధీనం చేసుకునే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. శ్రీవారి నగలు మాయమయినట్లు మాట్లాడుతున్నారని, ఇది బీజేపీ, వైసీపీ ఆడిన నాటకం కాదా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పాలన బాగోలేదని బ్యాంకులు, ఏంటీఎంలలో డబ్బులు లేవని ఇదేం పరిపాలన? అంటూ ప్రశ్నించారు.